అమరావతికి కేంద్రం అందిస్తున్న సంపూర్ణ సహకారంలో ఇది ఓ తీపి కబురు అనుకోవచ్చు. అమరావతికి ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి కేంద్రం ఇప్పిస్తున్న రుణాలు.. ఏపీ రుణ పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ అఢిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. అంటే అమరావతి అప్పులు అసలు ఏపీ అప్పుల కిందకు రావు. నిజానికి అప్పులను కేంద్రం గ్రాంట్లుగా ఇస్తోందన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఇప్పుడు స్పష్టత వచ్చినట్లయిందది.
ప్రతి రాష్ట్రానికి అప్పులు చేసుకునేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితి ఉంటుంది. ఈ పరిమితికి మించి ఏపీ అప్పులు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు చెబుతున్న లెక్కల్లో నలభై, యభై వేల కోట్ల అమరావతి అప్పు కూడా ఉంది. ఇది అప్పే కానీ కట్టాల్సింది రాష్ట్రం కాదన్న వాదనను అంగీకరించడం లేదు. ఇప్పుడు తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తుంది. స్వయంగా వైసీపీనే ప్రశ్న అడిగి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇప్పించింది.
ఇప్పటికీ అమరావతిని అడ్డుకోవడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఐదేళ్ల పాటు ఒక్క పని చేయకుండా.. అమరావతిని అడవిని చేసిన వైసీపీ ఇప్పుడు నిధుల సేకరణపై విషం చిమ్ముతోంది. ప్రపంచబ్యాంక్ సహా నిధులు సాయం చేసే సంస్థలకు లేఖలు రాసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి కూడా లేఖలు రాస్తున్నారు. అయితే అన్నింటినీ అధిగమించి ఈ నెలలోనే పనులు ప్రారంభించడం ఖాయమయింది.