వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న వారికి దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతును క్రమంగా తగ్గించడంలో పాలకులు సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది. వారు తలపెట్టిన ర్యాలీ హింసాత్మకం అవడం.. ఎర్రకోటపైకి ఎక్కి జెండా ఎగురేయడం… ఆ తర్వాత అదే పనిగా సాగిన ప్రచారం.. మొత్తానికి రైతుల ఉద్యమం దారి తప్పిందన్న ఓ అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నించారు. దాదాపుగా సక్సెస్ అయ్యారు. నిజానికి అనుమతించిన రూట్లలో రైతులు ర్యాలీలు చేశారు. వెనక్కి వెళ్లిపోయారు. కొంత మంది మాత్రమే దాడులకు దిగారు. వారు ఓ నాలుగైదు వేల మంది ఉంటారు. ఏడెనిమిది లక్షల మంది ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు.. వెనక్కి వెళ్లారు. మళ్లీ సరిహద్దుల్లోనే నిరసన తెలుపుతున్నారు. దాడులు దిగిన వారెవరన్నదానిపై క్లారిటీ లేదు. అన్నింటికీ మూలం అని చెబుతున్న దీప్ సిద్ధూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు కానీ పోలీసులకు చిక్కడం లేదు. దేశద్రోహం కేసులు పెట్టి పోలీసులు తదుపరి వ్యూహం అమలు చేస్తున్నారు.
ఈ లోపు.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై సాధారణ ప్రజలు తిరగబడుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. సింఘ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని .. అక్కడి ప్రజలు ధర్నా చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఓ వైపు రైతులపై ఉద్ధృతంగా సాగుతున్న వ్యతిరేక ప్రచారానికి తోడు… మరో వైపు… పోలీసులు కూడా ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. రైతులపై కన్నెత్తి చూడటానికి సాహసించని పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ్నుంచి తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ పోలీసులు ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు.
మొత్తంగా చూస్తే… వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే పోరాడుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల నుంచి వారికి కనీస మద్దతు రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి..ఈ చట్టాలను అమలు చేయాలని పట్టుదలతో ఉన్న పెద్దలకు .. వారిపై వ్యతిరేకత పెంచితే చాలన్న వ్యూహాన్ని అమలు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు వారిని ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించవచ్చు. గతంలో ఆఫర్ ఇచ్చినట్లుగా ఒకటిన్నర ఏడాది కూడా పెండింగ్ లో పెట్టకుండా వెంటనే చట్టాలను అమలు చేయవచ్చు. దాని వల్ల లాభనష్టాలేమిటనేది అనుభవమైతేనే తెలుస్తుంది. కానీ నోట్ల రద్దు, లాక్ డౌన్ లాగా… అవి అనుభవించాల్సింది ప్రజలే. పాలకలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు.