తెలంగాణ రాజకీయాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ నిరుపయోగమని.. అనుమతులు లేవని .. కేసీఆర్ కమిషన్ల కోసమే కట్టారన్న ఆరోపణలను ఇప్పుడు బీజేపీ వైపు నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తెలంగాణ నేతలు ఎప్పట్నుంచో ఈ ఆరోపణలు చేస్తున్నారు. కానీ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ స్వయంగా ఇప్పుడు కాళేశ్వరం గురించి చెబుతున్నారు. అదో దండగమారి ప్రాజెక్ట్ అని చెప్పడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని … అందుకే వరదలకు కొట్టుకుపోయిందని అంటున్నారు.
అయితే బీజేపీ నేతలదంతా డ్రామా అని… కేంద్రం చేతిలో అధికారం ఉండి..కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ చేయించరని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాగే టీఆర్ఎస్ కూడా అనుమతులు.. అప్పులు కూడా ఇచ్చింది కేంద్రమే కదా అని. మండిపడుతోంది. కాళేశ్వరం విషయంలో తాము చేస్తున్న ఆరోపణలకు బీజేపీ జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడింది. దీంతో కేంద్రం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత నిరర్థకమో.. కేంద్ర జలశక్తి శాఖ నోట్ విడుదల చేస్తుందని.. అనుమతులు లేకుండా కట్టారనే విషయాన్ని వెల్లడించబోతోందని అంటున్నారు.
ఇక ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు లక్ష కోట్లలో ఎంత దుర్వినియోగం అయిందో కూడా అధికారికంగా బయట పెడతారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లపై కూడా త్వరలో ఈడీ దాడులు జరుగుతాయని అందులో సందేహమే లేదని బీజేపీ వర్గాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు వరదల వల్ల ఆ ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీని పూర్తి స్థాయిలో బయటకు వచ్చేలా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా చూస్తే.. కాళేశ్వరం చుట్టూనే రాజకీయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.