తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం తాత్కాలికంగా ముగింపు ఇచ్చేసింది. అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తూ నోటిఫై చేసేసింది. అధికారిక పత్రం ఈ రోజు విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి అధికారం కేంద్రానికి దఖలు పడింది. ఒక్క చుక్క నీరు తీసుకోవాలన్నా ఇక కేంద్రం అనుమతి పొందాల్సిందే. ఒక్క కృష్ణా ప్రాజెక్టులపై మాత్రమే కాదు.. గోదావరి ప్రాజెక్టులను కూడా బోర్డులకే అప్పగించేసింది. విద్యుత్తు, నీటి విడుదల వాటి పర్యవేక్షణతో పాటు రక్షణ బాధ్యతలు కూడా కేంద్ర బలగాలే చూసుకుంటాయి. విభజన చట్టం అమల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నామని కేంద్రం నోటిఫికేషన్లో తెలిపనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ముసాయిదా పంపారు. ఆమోదించినా.. ఆమోదించకపోయినా… కేంద్రం తాను చేయాలనుకున్నది చేస్తుంది.
రాష్ట్ర విభజన నాటి నుంచి .. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీలు ఉన్నాయి. అయితే.. దేశంలో అన్ని ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సహజమే. ఏపీ, తెలంగాణ మధ్య కూడా ఉన్నప్పటికీ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో తెలంగాణ సర్కార్ కొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. దానికి పోటీగా దిగువ రాష్ట్రమైన ఏపీ కూడా కొన్ని ఎత్తిపోతలను చేపట్టింది. దీంతో రెండు రాష్ట్రాలు ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వం మారడం… కేసీఆర్ సర్కార్… జగన్మోహన్ రెడ్డికి మద్దతివ్వడంతో.. ఆయన విజయం సాధించారు. జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన కేసీఆర్… తాము జల పంచాయతీలను పరిష్కరించుకుంటామని ప్రకటించారు. బేసిన్లు లేవు..భేషజాలు లేవన్నారు. కేంద్రం గడప తొక్కాల్సిన అవసరం లేదన్నారు.
కానీ రెండేళ్లు తిరగకుండానే సమస్య పునరావృతం కావడం కాదు.. సీరియస్ అయింది. ఎగువరాష్ట్రం అయిన తెలంగాణ ఎడాపెడా.. ప్రాజెక్టులు నిర్మించడమే కాదు.. దిగువ రాష్ట్రం అయిన ఏపీ అభ్యంతరాలను సైతం పక్కన పెట్టి.. ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీ వరకూ నీటిని వాడేసి విద్యుత్ ఉత్పాదన చేసింది. చివరికి ఏపీ సర్కార్ నెత్తినోరూ బాదుకుండా కేంద్రానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి కేంద్రం… పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకోవడంతో… బోర్డులను నోటిఫై చేయాలని నిర్ణయానికి వచ్చింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులపై అధికారం తెలుగు రాష్ట్రాలకు లేకుండా పోయింది. రాజకీయ స్నేహా గీతాలాపనలు.. వాటి ప్రయోజనాలు… కేవలం.. ఆయా రాజకీయ ఉద్దేశాలు నెరవేరేవరకే ఉంటాయి కానీ.. తర్వాత మరింత తీవ్రమవుతాయని.. నీటి వివాదంతో మరోసారి వెల్లడయినట్లయింది.