రెండురాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంతో ఇదే సందనుకుని కేంద్ర ప్రభుత్వం… నీళ్లపై అధికారాన్ని లాగేసుకుంది. అది తప్పో ఒప్పో కానీ.. ఓ నిర్ణయం అయితే చేసేసింది. ఇప్పుడు.. రాజధాని విషయంలోనూ.. అదే విధంగా కేంద్రమే పరిష్కరించాలని.. ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రాన్ని కోరుతున్నారు. ఆయన.. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర విభజన చట్టం ప్రకారం చూస్తే మూడు రాజధానులు చట్ట విరుద్ధమని.. ఒకవేళ మూడు రాజధానులు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటే.. పార్లమెంట్లోనే చట్ట సవరణ చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన సాధ్యంకాదని ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను గుర్తించే.. హైకోర్టు రాజధాని తరలింపు అంశంపై స్టే ఇచ్చిందని భావిస్తున్నానని.. తక్షణం కలుగచేసుకోవాలని రఘురామకృష్ణరాజు అమిత్ షాను కోరారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితినీ వివరించారు. పదిహేనో తేదీ వచ్చిన జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరిందని.. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. అందుకే తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.
నిజానికి రాజకీయంగా బీజేపీ, వైసీపీ పరస్పరం సహకరించుకుంటున్నాయి. రాజధానిని రాజకీయ అంశంగా మాత్రమే చూస్తున్న కేంద్రం… ఇంత వరకూ… మూడు రాజధానులు తప్పు అనిఒక్క సారి గా రాష్ట్రానికి చెప్పలేదు. ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా.. రాష్ట్రానికే కాదు.. దేశ సంపద సృష్టికి విఘాతం అని తెలిసినా కేంద్రం స్పందించలేదు. ఇప్పుడు రఘురామ లేఖతో అమిత్ షా స్పందిస్తారన్న ఆశ కూడా లేదు.కానీ రఘురామ మాత్రం ఓ ప్రయత్నం చేశారని అనుకోవాలి.