పోలవరం సందర్శన ఇదిగో అదుగో అంటూ వాయిదా వేస్తున్న కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ తన సలహాదారు సంజరు పుల్కర్ను పంపించారు. గడ్కరీ 22న వస్తారనీ కాదు 23న అని రకరకాలుగా వార్తలు వచ్చాయి. వీటి మధ్యలోనే రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చారు. అంతా బాగానే వున్నట్టు చిత్రణ ఇచ్చారు. ప్రతిపక్షాల ప్రతినిధులు కూడా కేంద్రమంత్రిని కలిసినప్పుడు చట్టం పరిధిలోనే నిధులు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. పోలవరం బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నా అది కేంద్రం తరపునేనని అధికార పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ విధానం వల్ల మనకు రావలసిన ఘనత మొత్తం టిడిపికి పోతున్నదని ఎపి బిజెపి నేతలు గగ్గోలు పెడుతుండడంతో జోక్యం ద్వారా తన పట్టు చూపించడం బిజెపికి రాజకీయ అవసరంగా మారింది.గడ్కరీ వంటి వారు వస్తే రాజకీయ రంగు వస్తుంది గనక అధికారిని పంపించారు. వచ్చిన సంజరు సాంకేతికంగా ప్రాజెక్టు లోతట్టులో అతుకుల బొంతగా కాఫర్ డ్యాం నిర్మాణం మంచిది కాదని తేల్చిచెప్పారంటున్నారు. ఇదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ వ్యూహం రాజకీయ వ్యూహం కూడా తిరస్కరించినట్టే. ఎందుకంటే కాఫర్ డ్యాం ద్వారా ఎలాగో నీళ్లువిడుదల చేశామనిపించుకోవాలని ప్రభుత్వ ఆలోచనగా వుంది. దానికే ఎసరు పెడితే బహుశా మళ్లీ కేంద్ర రాష్ట్రాల రాజకీయ దాగుడుమూతలు మరోసారి తీవ్రమవుతాయి. నేరుగా ఖండించకుండా ముఖ్యమంత్రి ఇతరేతర పద్దతులలో వత్తిడి పెంచితే పురంధేశ్వరి సోము వీర్రాజు వంటి వారితో బిజెపి తమ వాదన ముందుకు తెస్తుంది. ఏమైనా పోలవరం వివాదాలు ఇప్పుడే పరిష్కారం కావన్నది మాత్రం సత్యం. అందుకు నిధుల కొరత సాంకేతిక సమస్యల కన్నా రాజకీయ ప్రయోజనాల వేట కారణం కావడమే విచారకరం.