రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని శ్రీలంక తరహా పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే శ్రీలంక దేశం అని.. అలాంటిది రాష్ట్రాలతో ఎలా పోలుస్తారని.. అప్పుల జాబితాలో దివాలా స్థితికి ఎక్కిన రాష్ట్రాలు మండిపడ్డాయి. దేశం చేస్తున్న అప్పులు అంటే కేంద్రం చేస్తున్న అప్పుల సంగతేమిటని ప్రశ్నించాయి. అయితే ఈ ప్రశ్న ఆషామాషీగా.. రాజకీయం కోసం అడిగినా వాస్తవంలోకి తొంగి చూస్తే భారత్ కూడా రుణాల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తోది.
ప్రస్తుత భారత ప్రభుత్వం నెత్తి మీద ఉన్న అప్పు రూ. 155 లక్షల కోట్లు. మన జీడీపీలో అరవై శాతం. అంటే అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇప్పులు తెచ్చారన్నమాట. ఏపీలో వైసీపీ చెబుతున్న గత అప్పులు తీర్చాం అనే మాటలు కేంద్రం నుంచి కూడా వస్తూ ఉంటాయి. కానీ.. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు కడుతున్న ఈఎంఐలు పిసరంత అయితే చేస్తున్న అప్పులు కొండంత. గత ఐదేళ్ల కాలంలోనే ఏకంగా 63 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇంత భారీ మొత్తం అప్పులు చేసి… దేశంలో ఎలాంటి అభివృద్ధి చేశారన్న దాన్ని బీజేపీ స్పష్టంగా ప్రజల ముందు పెట్టలేకపోతోంది.
ఓ వైపు దేశ ప్రజలపై పన్నులతో దాడి చేస్తున్నారు. మరో వైపు పెద్ద ఎత్తున అప్పులు తెస్తున్నారు. ఈ సొమ్ములన్నీ ఎటు పోతున్నాయన్నది చాలా మందికి అర్థం కాని విషయం. అర్థమయ్యేలా సమాచారం కూడా కేంద్రం ప్రజలకు ఇవ్వడం లేదు. అటు కేంద్రం అప్పులు.. కూడా ప్రజలపైనే పడతాయి. ఇటు రాష్ట్రాల అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఏవైనా అప్పులు చేస్తే అవీ ప్రజలపైనే పడతాయి. అందుకే… ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పన్నుల భారం పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితి దిగజారిపోవడంతోనే శ్రీలంక పరిస్థితి అలా తయారయింది. మరి ఈ విషయంలో పాలకులుక ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయో లేదో అనే డౌట్ సహజమే. ఎందుకంటే… ఏదైనా ప్లాన్ ఉంటే పన్నులు ఎందుకు పెంచుకుంటూ పోతారు ?