ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లేవారికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు దేశాలకు వెళ్ళేవారు కొంతకాలం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేవని..ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఆ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది.
ఇరాన్ లో 4 వేల మంది, ఇజ్రాయెల్ లో 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటించడం ఏమాత్రం సురక్షితం కాదని భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో భారతీయ ఎంబసీలతో అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ రెండు దేశాలలో ఉన్న భారతీయులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని కోరింది.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ద వాతావరణం కమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం తప్పదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందంటూ ప్రముఖ జర్నల్ వాల్ స్ట్రీట్ ఓ కథనం కూడా ప్రచురించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయెల్ కూడా మద్దతు నిలవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో.. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే భారీ ప్రాణ, ఆస్థి నష్టం సంభవించే అవకాశం ఉందని భారత్ అంచనా వేస్తోంది. అందుకే ప్రమాదాన్ని ముందే గుర్తించి.. అక్కడి భారతీయ పౌరులను అలర్ట్ చేయడంతోపాటు అక్కడికి వెళ్ళే వారిని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.