ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుమీడియం లేకుండా ఎత్తేసి ఒక్క ఇంగ్లిష్ మీడియమే పెట్టాలన్న పట్టదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కేంద్రం కౌంటర్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో వేసిన కౌంటర్‌తో.. జగన్ నిర్ణయం అమలు చేయడం చట్ట విరుద్ధమని తేల్చేసింది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో సాగాలన్నదే తమ విధానమని కేంద్రం స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్ర పాఠశాల విద్యాశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రాథమిక విద్యాబోధన తప్పనిసరిగా పిల్లల మాతృభాషలోనే సాగాలని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 350ఎ ప్రకారం భాషాపరంగా మైనార్టీ వర్గాల పిల్లలకు సైతం ప్రాథమిక విద్యను వారి మాతృభాషలోనే బోధించాల్సి ఉందని కేంద్రం అఫిడవిట్లో స్పష్టం చేసింది. అందుకు అనువైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 (ఎఫ్) కూడా సాధ్యమైనంత మేరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని చెబుతోందని అఫిడవిట్లో తెలిపింది. నూతన విద్యావిధానం కూడా ఇదే చెబుతున్నట్లు వివరించింది.
పిల్లలు తమ మాతృభాషల్లో అయితేనే క్లిష్టమైన అంశాలను సులభంగా నేర్చుకోగలరు. కనీసం ఐదో తరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. దీన్ని 8వ తరగతి, అంతకుమించి కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. మరో వైపు తెలుగు భాషా పండితులు కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌తో ఏపీ సర్కార్ కు మరో విషయంలో కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్న చర్చ న్యాయవాద వర్గాల్లో ప్రారంభమయింది.