2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరతామంటూ రాష్ట్రంలోని తెలుగుదేశంతోపాటు, కేంద్రంలో భాజపా సర్కారు కూడా చెబుతోంది. సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా శ్రమిస్తున్నారని టీడీపీ చెబుతోంది. నిజానికి, ఈ విషయంలో చంద్రబాబు పట్టుదలతోనే ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ నిధులూ, రైల్వేజోన్ వంటి అంశాల కంటే పోలవరంపైనే ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి, భాజపా కూడా తమ క్రియాశీలతను చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైకాపా కూడా పోలవరం నుంచి కొంత రాజకీయ ప్రయోజనం ఆశిస్తోందనే చెప్పాలి!
వైకాపా ప్రయత్నం ఏంటంటే.. పోలవరం పూర్తయితే తామూ సంతోషిస్తామనీ, కాకపోతే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పోలవరం బాధ్యతల్ని వెనక్కి తీసుకోవాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. అదే పనిలో భాగంగా తాజాగా వైకాపా ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గట్కరీని కలుసుకున్నారు. బయటకి చెప్పడం లేదుగానీ.. ఏపీ భాజపా నేతల ప్రయత్నం కూడా దాదాపు ఇలాంటిదే! పోలవరం నిర్మాణ ఘనత భాజపాకి దక్కడం లేదన్నదే వారి ఆవేదన. టీడీపీతో ప్రమేయం లేకుండా ఏపీ కమలనాధులు తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షం పోలవరంపై సమావేశం నిర్వహించుకున్న సంగతీ తెలిసిందే. జాతీయ ప్రాజెక్టు కాబట్టి, రాష్ట్ర ప్రమేయం తగ్గించాలనేదే వారి అప్రకటిత ప్రయత్నంగా చెప్పొచ్చు.
అయితే, వాస్తవంలో ఇది సాధ్యమా..? అంటే.. కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే, జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పనులు జరిగేది రాష్ట్రస్థాయిలోనే కదా. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా అది సాధ్యమయ్యే పని కాదు. కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా ముందుకు సాగాల్సిందే. పోనీ.. పోలవరంపై రాష్ట్ర సర్కారు సక్రమంగా వ్యవహరించడం లేదన్న పరిస్థితి ఉన్నా, ఆ కారణాన్ని పెద్దదిగా భాజపా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాస్తవంలో అదీ లేదు. భాజపా వైఖరి వల్లనే పోలవరం ఆలస్యం అవుతోందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఇప్పటికే టీడీపీ కొంతమేర సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎలా చూసుకున్నా ప్రతిపక్షం ఆశిస్తున్నట్టుగా పోలవరం బాధ్యతల నుంచి టీడీపీని పూర్తిగా తప్పించే పరిస్థితి రాదనే చెప్పొచ్చు.
ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు చొరవపైనే భాజపా ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని అనొచ్చు! 2019 నాటికి ఎలాగైనా పూర్తి చేయాలన్నది ఏపీ సీఎం సంకల్పం. కానీ, కేంద్రం దగ్గర ఉన్న నివేదికల ప్రకారం ఆ డెడ్ లైన్ సరిపోదట! అదనంగా మరో రెండేళ్లు పడుతుందనేది వారి దగ్గర ఉన్న నివేదిక సారాంశంగా చెబుతున్నారు. అలాంటప్పుడు, 2019లోపు పూర్తి కాకపోతే.. అప్పటి పరిస్థితి ఏంటీ..? టీడీపీ దగ్గర దానికీ సమాధానం రెడీగానే ఉంది. ఎప్పటికప్పుడు కేంద్రం మోకాలడ్డు పెట్టడం వల్లనే అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయామనీ, రాష్ట్ర స్థాయిలో శక్తికి మించి కష్టపడ్డామని చెప్పుకునే వెలుసుబాటు ఉండనే ఉంది. ఒకవేళ ఇప్పుట్నుంచీ పోలవరం బాధ్యతల్నీ భాజపా గుండుగుత్తంగా నెత్తిన వేసుకుంటే.. అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతే భాజపా ఏం చెప్పుకుంటుంది..? అందుకే, ప్రస్తుత పరిస్థితిని కొనసాగిస్తే… పోలవరం ఆలస్యానికి చంద్రబాబు తీరే కారణమని విమర్శించే అవకాశం వారికీ ఉంటుంది. కాబట్టి, ఏరకంగా చూసుకున్నా టీడీపీని పక్కనపెట్టేసే స్థాయిలో భాజపా పూర్తిగా ఛార్జ్ తీసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఏపీ భాజపా నేతలు కోరుతున్నారో, ప్రతిపక్ష పార్టీ వైకాపా డిమాండ్ చేసినంత మాత్రాన కేంద్ర వైఖరిలో మార్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పేరుతో తమకూ రాజకీయ లబ్ధి పెరగాలన్న కోణం నుంచే భాజపా వ్యూహరచన ఉంటుందని మాత్రమే చెప్పొచ్చు.