కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లుగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంత కన్నా తక్కువ వయసులో పెళ్లి చేస్తే అది బాల్య వివాహం కింద పరిగణించి చర్యలు తీసుకుంటారు. దేశంలో అందరికీ ఓటు హక్కు పద్దెనిమిదేళ్లకే వస్తోంది. మైనారిటీ కూడా పద్దెనిమిదేళ్లకే తీరుతుంది. అలాంటి సమయంలో మహిళల వివాహ వయసు 21 ఏళ్లుగా నిర్ణయించారు.
మన దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి నిండక ముందే పెళ్లిళ్లు చేసేస్తున్నారని దీని వల్ల వారికి పుట్టే పిల్లలు అనారోగ్యంగా ఉంటున్నారని, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమ్మాయిలు 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటే కుటుంబ పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని.. అదే 21 సంవత్సరాల తర్వాత చేసుకుంటే.. కుటుంబం, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయని ఆ టాస్క్ ఫోర్స్ టీమ్ అభిప్రాయపడింది. అందుకే వివాహ వయసు 21 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే గతంలో పద్దెనిమిదో లా కమిషన్ దీనికి భిన్నమైన సిఫారసులు చేసింది. పురుషుల వివాహ వయుసునే 18 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఇలా చేయడం వల్ల వివిధ రకాల నేరాలకు ఆ వ్యక్తిని వేధించే పరిస్థితులు నివారించవచ్చని చెప్పిదంి. పుట్టినప్పటి నుండి ఆడపిల్లల పోషకాహార పరిస్థితులు సరిగా లేనపుడు 21ఏళ్ళకి వివాహం చేసుకుని ఆ తర్వాత పిల్లలకుజన్మనిచ్చినా తల్లీ పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఎలా మెరుగుపడతాయన్న సందేహాలు సహజంగానే వస్తున్నాయి. అందుకే దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటి గురించి పక్కన పెట్టేసి.. ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్నది చాలా మందికి వస్తున్న సందేహం. ప్రభుత్వాలు అంటే అంతే మరి !