అమరావతి రాత మారుతోంది. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేలా రాజధాని విషయంలో చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా రాజధానిగా అమరావతికి ఓ రూపునివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా స్పీడ్ పెంచేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరగా.. అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రంలోని ఇంతర ప్రాంతాలతో రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే పలు రహదారులకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189కి. మీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని 2014 -19లోనే కొన్నింటిని టీడీపీ సర్కార్ చేపట్టినా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతిపై విషం కక్కడంతో ఈ ప్రాజెక్టులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో అమరావతి విషయంలో వేగం పెంచారు. రాజధానిగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా చేస్తానని ప్రకటించిన చంద్రబాబు అందుకోసం రాజధానికి రహదారుల కనెక్టివిటీ మెరుగ్గా ఉండేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఫలితం సాధించారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం 20-25వేల కోట్లకు పైగా వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్రం..అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కోసం ఇప్పుడున్న రహదారికి ప్రత్యామ్నాయంగా ఆరు వరుసల గ్రెన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు ప్రాథమికంగా అంగీకరించింది. అలాగే, సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు అమరావతిని అనుసంధానించడంతోపాటు, మేదరమెట్ల – అమరావతి మధ్య 90 కి. మీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు కూడా కేంద్రం ప్రాథమికంగా అంగీకారం తెలిపింది.
వీటికి కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక ఆచరణలోకి రానున్నాయి.ఈ ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తైతే అమరావతి ముఖచిత్రమే మారిపోతుంది. ఇదే ఎజెండాతో చంద్రబాబు కూడా పని చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటి ఢిల్లీ పర్యటనలో అమరావతి విషయంలో చంద్రబాబు మంచి సత్ఫలితాలను రాబట్టారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.