కాకినాడలో రౌడీరాజ్యం కేంద్ర ప్రభుత్వ రికార్డులకు ఎక్కింది. కేంద్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. కాకినాడలో పరిస్థితులు.. అక్కడ రౌడీల వ్యవహారాలు జరిగిన, జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు… ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ.. సంపూర్ణ నివేదిక పంపాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ నుంచి ఈ లేఖ… రాష్ట్రానికి చేరింది. దీనికి కారణం.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల అరాచకాలే. మూడు నెలల కిందట.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికాకినాడలో ఓ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అత్యంత దారుణంగా దుర్భాషలాడారు. పక్కనే ఎంపీ వంగా గీత వంటి మహిళలు ఉన్నప్పటికీ.. ఆయన తగ్గకుండా బండబూతులు తిట్టారు. దీంతో.. పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.
అక్కడ చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేటు సైన్యం చెలరేగిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా దాడులకు పాల్పడింది. మహిళల్ని డ్రైనేజీ కాలువల్లోకి తోసేసి కొట్టారు. కొంత మంది ప్రాణభయంలో గుడిలో దాక్కున్నప్పటికీ.. అక్కడికీ వెళ్లి కొట్టారు. ఆ తర్వాత కూడా పరిస్థితులు మారలేదు. ద్వారంపూడి అనుచరులు… ప్రైవేటు సైన్యంగా మారి కాకినాడను గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలందర్ని భయపెడుతూండటం.. ఎదురు తిరిగిన వారిపైనే పోలీసులు కేసులు పెడుతూండటంతో.. ప్రజలెవరూ ఫిర్యాదు చేయడానికి కూడా బయటకు రావడం లేదు. కాకినాడలో ఉన్న ఇలాంటి పరిస్థితులపై సూర్యనారాయణ అనే వ్యక్తి కేంద్ర హోంశాఖకు.. పూర్తి అధారాలతో ఫిర్యాదు పంపారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై జరిగిన దాడితో పాటు… ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న రౌడీ కార్యకలాపాలపై పూర్తి స్థాయి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
సాధారణంగా శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే వివరణ కోరుతుంది. ప్రస్తుతం.. కేంద్రానికి.. పంపిన లేఖలోనూ.. అదే చెప్పింది. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కాకినాడలో పరిస్థితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని… ఆదేశించింది. సమస్య తీవ్రంగా ఉంది కాబట్టే కేంద్రం స్పందించిందనే భావన.. వ్యక్తమవుతోంది. పోలీసులు నిమిత్త మాత్రులుగా మారడం… సామాన్యుల్ని ఎమ్మెల్యే అనుచరులు బెదిరించి దోచుకోవడం లాంటివి.. చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశాలుగా కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.