కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన చేయించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి..రెండు విడతలుగా సమావేశమైనా… వాగ్వాదానికి దిగినా…చివరికి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామనే పడికట్టు ప్రకటన చేశారు తప్ప.. కచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మాత్రం చెప్పలేదు. తాము గట్టిగా చెప్పలేకపోవడానికి ఏపీ ప్రభుత్వమే కారణం అన్నట్లుగా చెప్పుకొచ్చారు.. రెండు అంశాలపై ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ నెల 22న మెకాన్ సంస్థ భూమి విషయంలో కావాల్సిన వివరాల కోసం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందట. అంటే.. సీఎం రమేష్ దీక్ష ప్రారంభించిన తర్వాతే లేఖ రాసి.. సమాచారం రాలేదనే నెపాన్ని మాత్రం రాష్ట్రం మీద నెట్టేసే ప్రయత్నం చేసింది..
ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్ ఫోర్స్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలుంటాయని మాత్రమే బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చి సరిపెట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రయత్నాలు సరైన దిశలోనే ఉన్నాయని అంటూనే పాత ప్రశ్నలను మళ్లీ తిరగతోడేందుకు ప్రయత్నించారు. కడప ఉక్కుకు సంబంధించి తొమ్మిది అంశాలపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు రాష్ట్రం వివరణ ఇచ్చినప్పటికీ మళ్లీ అదే అంశాలను ప్రస్తావించారు. కర్మాగారానికి అవసరమైన భూమిపై రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. కొంత ప్రైవేటు భూమి సేకరణపై కేంద్రం ప్రస్తావించిన అనుమానాలపై ఏపీ సర్కారు వివరణ ఇచ్చింది.గనుల లింకేజీకి సంబంధించి కూడా అనుమానాలకు తెర దించింది. 1.5మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభించే గనులున్నాయని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లెక్కలు చెప్పింది. అయినా బీరేంద్ర సింగ్ మళ్లీ ఆ రెండు సమస్యలనే ప్రస్తావించారు.
కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుబట్టారు. కానీ బీరేంద్రసింగ్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. దీనితో కథ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది.ఉక్కు ఫ్యాక్టరీకి తాను సుముఖంగానే ఉన్నానని బీరేంద్ర సింగ్ విడిగా ఎంపీలు వద్ద అనడం కొసమెరుపు, పరిస్థితులు అనుకూలించడం లేదని ఆయన వాపోయారు. ఆ అనుకూలించని పరిస్థితులేమిటో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని తెలుగు దేశం నేతలు అంటున్నారు.
అంటే కేంద్రం…చేద్దాం.. చూద్దాం.. చేస్తాం.. అన్న విధానానికే కట్టుబడి ఉందని తేలిపోయింది. నెపం ఎలాగైనా రాష్ట్రం మీద తోసేస్తే సరిపెట్టుకోవచ్చనుకుంటోందని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఉక్కు పరిశ్రమ కోసం.. ఆమరణదీక్ష చేస్తున్న బీటెక్ రవి ఆరోగ్యం క్షీణించడంతో … ఆస్పత్రికి తరలించారు.