బంగారం అనగానే వామ్మో అనే పరిస్థితి వచ్చేసింది. పది గ్రాములకు 73వేల రూపాయలు దాటి పసిడి పరుగులు పెడుతోంది. లక్ష దాటుతుంది అన్నది అంచనా. పైగా, ఇండియా సహా చాలా దేశాల రిజర్వు బ్యాంకులు సైతం బంగారం నిల్వలు పెంచుకునే పనిలో ఉన్నాయి.
ఇండియాలో ప్రస్తుతం 24క్యారెట్ల మేలిమి బంగారం 73వేలు, 22 క్యారెట్ల బంగారం 68వేల వరకు ధర ఉంది. అయితే, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారం తీసుకరాబోతుంది. గోల్డ్ మార్కెట్ కు ఉన్న డిమాండ్ తో పాటు, పెరుగుతున్న ధరలతో అందరికీ బంగారం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే ఆలోచనతో ఉందని తెలుస్తోంది.
ఈ 9 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు 25 వేల నుండి 30వేల మధ్య ఉండే అవకాశం ఉందని గోల్డ్ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. బంగారం ఎంత ప్యూరిటీ ఉంది అనేందుకు హాల్ మార్క్, బీఎస్ఐ ముద్రలు బంగారంపై ముద్రిస్తుంటారు. ఇప్పుడు 9 క్యారెట్ల బంగారానికి కూడా నాణ్యత దృవీకరణకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది.
కేంద్రం తీసుకొచ్చే ఈ 9 క్యారెట్ల బంగారం దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, మేలిమి బంగారానికి ఉండే డిమాండ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. 22క్యారెట్ల బంగారు ఆభరణాలు రెడీమేడ్ గా దొరుకుతున్నా… ఇప్పుటికీ బిస్కెట్ బంగారం అనుకుంటూ ఎగబడే వారు మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. మరి కేంద్రం అనుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.