నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై అక్షరాలా కక్ష కట్టినట్లే వ్యవహరిస్తోంది. అదిగో..ఇదిగో అన్న కడప ఉక్కు పరిశ్రమపై కూడా తూచ్ అనేస్తోంది.
విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఏ మాత్రం సుముఖంగా లేదని సుప్రీంకోర్టు సాక్షిగా వెల్లడయింది. విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ కు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో… ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీలకి ఫీజిబిలిటి లేదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్ ప్రకారం చూస్తే.. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు.. ఉక్కుపరిశ్రమలు ఇచ్చే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ లో ఉంది. దాని ప్రకారం నరేంద్రమోదీ ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆర్థికంగా ఉపయుక్తం కాదని 2015 జూన్లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి కేంద్రం దీనిపై విముఖత చూపుతోంది. రాష్ట్రప్రభుత్వం పదేపదే ఒత్తిడి తేవడంతో ఓ టాస్క్ఫోర్స్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కడప ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని ఉక్కు శాఖమంత్రి బీరేంద్ర సింగ్ కూడా ప్రకటించారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నామని… ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారో రాష్ట్రమే చెప్పాల్సి ఉందని మార్చి ఇరవై ఎనిమిదిన బీరేంద్ర సింగ్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు. కడప సమీపంలో ఉక్కు నిక్షేపాలు తక్కువ ఉన్నా బళ్లారి నుంచి ముడి ఖనిజం తీసుకొనేందుకు అవకాశం ఉన్నట్లు టాస్క్ఫోర్స్ నివేదిక చెప్పిందన్నారు. భూమి, విద్యుత్తు, నీరు, రవాణా సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మా మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోందని కూడా చెప్పుకొచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. జమ్మలమడుగు వద్ద 3000 ఎకరాల భూమి, కర్మాగారానికి అవసరమైన ఒక టీఎంసీ నీరు, పవర్ గ్రిడ్ చూపించామని… రైలు అనుసంధానంపై స్పష్టత ఇచ్చామని ప్రకటించింది. భారీ ప్రాజెక్టులకు ఇచ్చే రాయితీలన్నీఇస్తామని స్పష్టం చేసింది. అప్పటి నుంచి కేంద్రం సైలెంట్ గా ఉంది.
చివరికి ఈ నెల పన్నెండో తేదీన మంగళవారం కూడా.. కేంద్ర ఉక్కు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల గనుల శాఖ ఉన్నతాధికారులు టాస్క్ఫోర్స్ భేటీలో పాల్గొన్నారు. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున స్టీల్ ప్లాంట్లకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకునేందుకే సమావేశానికి పిలిపించానని కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి చావు కబురు చల్లగా చెప్పారు. ఇప్పుడు .. కేంద్రంలో అసలు స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదన్నట్లుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు.