ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నలుగుతున్న విభజన అనంతర సమస్యలపై ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు ఫోకస్ చేశారు. ఏ రాష్ట్రానికి ఏం రావాలి, చిక్కుముడిగా ఉన్న సమస్యలేంటీ అన్న అంశాలపై సీఎంలు ఇటీవలే భేటీ అయ్యారు. అధికారులతో ఒక కమిటీ వేయగా, మంత్రులతో మరో కమిటీ వేసి… సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
తాజాగా విభజన అనంతర సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలకు సమాచారం అందించింది.
ఈనెల 24న ఢిల్లీలో హోంశాఖ కార్యాలయంలో జరిగే మీటింగ్ కు రావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ సీనియర్ అధికారుల స్థాయిలో జరగబోతుండగా… ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టులోని షెడ్యూల్ 13లోని సమస్యలే ఏజెండాగా మీటింగ్ ఖరారైంది.
రీఆర్గనైజేషన్ యాక్టులోని 13వ షెడ్యూల్ లో జాతీయ విద్యా సంస్థలున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఐఐటీ, ఐఐఎం, ఇతర యూనివర్శిటీలతో పాటు ఏపీలో పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలున్నాయి. వాటికి నిధులు, స్థలం, గతంలో ఉన్న ఇతర సమస్యలకు ఓ పరిష్కారం వచ్చే అవకాశం కనపడుతోంది.