జమిలీ ఎన్నికలకు కేంద్రం సైలెంట్‌గా రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే అనేక రకాల రాజ్యాంగ ప్రక్రియల ద్వారా జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పించింది. లా కమిషన్‌తో పాటు వివిధ కమిటీలు జమిలీ ఎన్నికలు దేశానికి మంచివని చెప్పాయి. తాజాగా… పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు నివేదికను సమర్పించింది. దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేం కాదని.. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది.
లా కమిషన్ చేసే సిఫార్సుల మేరకు.. జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. లా కమిషన్ కూడా రికార్డెడ్‌గా పార్టీల అభిప్రాయాలను నమోదు చేసింది. అత్యధిక పార్టీలు ఓకే చేశాయి. ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఓ ఎన్నికల సందడి ఉండటం వల్ల.. అభివృద్ధి కుంటు పడుతోందని … బీజేపీ అగ్రనేతల అభిప్రాయం. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత .. ప్రతీ ఏడాది ఏదో ఓ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్ాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో స్థానిక సంస్థల హడావుడి ఉంటోంది.
పైగా బీజేపీ విధానం వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ అనేది. ఇప్పటికే ఒకే ఓటరు జాబితాకు కూడా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే.. ఏడాది ముందే సాధారణ ఎన్నికలు పెట్టి.. సగానికిపైగా రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీని కోసం.. సైలెంట్‌గా ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.