దేశంలో మరో లాక్‌డౌన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. కరోనా సెకండ్ వేవ్‌ను అరికట్టాల్సిన అవసరం ఉందని.. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చర్యలు తీసుకోవాలో.. మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ.. వ్యాక్సినేషన్ అంశాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు. నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతూండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా పెరుగుతూండటంతో ఆంక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలో పలు చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. అక్కడ రోజుకు పదిహేడు వేల కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్రమోదీ సర్కార్.. దేశవ్యాప్త ఆంక్షలపై దృష్టి పెట్టినట్లుగా అంచనా వేస్తున్నారు.
కనీసం .. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే వరకూ అయినా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి ఈ మేరకు ముఖ్యమంత్రుల సమావేశంలో పరోక్షంగా చెప్పినట్లుగా అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ విధించి.. దాదాపుగా ఏడాది అవుతోంది. ఇప్పుడు మరోసారి ఆంక్షలు విధిస్తే… ఏడాదికి మళ్లీ కరోనా కష్టం తిరిగి వచ్చినట్లు అవుతుంది.