ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారన్న అంశంపై పరిశీలన జరుపుతామని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సమాచారం పంపారు. కొద్ది రోజుల కిందట ఎంపీ రఘురామ ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యం నమూనాలను పరిశీలించాలని అవి అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని .. వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయని లేఖలు పంపారు. వీటికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. మాములుగా ఇలా ఎంపీలు రాసిన లేఖలు చేసిన ఫిర్యాదులకు అక్నాలెడ్జ్ మెంట్ పంపుతూ ఉంటారు. సాధారణం అందింది అని పంపుతారు.
అయితే రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు మాత్రం పరిశీలన చేయిస్తామని చెప్పడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీలో దేశంలో ఇతర చోట్ల దొరికే లిక్కర్ బ్రాండ్లు దొరకవు. కారణం ఏమిటో తెలియదు కానీ.. అ లిక్కర్ బ్రాండ్లను పోలి ఉండే ప్యాకింగ్ పేర్లతో ఇతర మద్యం పెద్ద ఎత్తున అమ్ముతూ ఉంటారు. దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఈ కారణంగా ఏది అమ్మాలనేది ప్రభుత్వ ఇష్టం. ఎందుకో కానీ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు.. ఏపీ కోసమే తయారు చేసే మద్యం బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వం అమ్ముతోంది.
అదే సమయంలో ధర కూడా చాలా ఎక్కువ. మద్యం మాన్పించడానికి ధరలు పెంచామని ఏపీ సర్కార్ చెబుతోంది. ఇష్టమైన బ్రాండ్లు దొరక్కపోవడం.. నాసిరకం మద్యం అన్న ప్రచారం జరుగుతూండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ కూడా పెరిగిపోయింది. కట్టడి చేయడానికి ఎస్ఈబీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని కూడా పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏపీ మద్యంపై కేంద్రం పరిశీలన చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు ప్రముఖ బ్రాండ్లు ఎందుకు అమ్మడం లేదనే దగ్గర్నుంచి ఆ మద్యం తయారీ ప్రమాణాల వరకూ అన్నింటిన లెక్క చూడాలని రఘురామకృష్ణరాజు కోరుతున్నారు.