అమరావతి విషయంలో బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మంది మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ.. వ్యాఖ్యలు చేస్తూండగా.. మరికొంత మంది మాత్రం.. అమరావతి వైపే నిలబడుతున్నారు. అమరావతికి మద్దతుగా నిలబడుతున్న వారిలో.. చాలా మంది కేంద్రం ప్రస్తావన తెస్తున్నారు. కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుందని.. సుజనా చౌదరి చెప్పుకొస్తున్నారు. మొదట్లోనే.. నెల రోజుల కిందటే… మూడు రాజధానుల గురించి జగన్ అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడే… కేంద్రం చూస్తూ ఊరుకోదని..సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి ఆయన అదే మాట చెబుతున్నారు. ఇప్పుడుకూడా.. అదే చెబుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెబుతున్నారు. కానీ ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. అమరావతిలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి.
అక్కడి రైతులుపై.. మహిళలపై పోలీసులు విరుచుకుపడుతున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం కనీసం.. రాష్ట్రంలో పరిస్థితులపై కనీసం ఓ నివేదికను గవర్నర్ నుంచి తెప్పించుకున్నట్లుగా కూడా..సమాచారం లేదు. కేంద్రం ఏపీ రాజధాని అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదని ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్ని బట్టి తెలిసిపోతుంది. నిజానికి.. జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల క్రితమే.. కేంద్రానికి ఓ ప్రత్యేకమైన నివేదిక ఇచ్చారని జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని.. రాజధాని మార్చాలనుకున్నారని అప్పుడే … ఇంగ్లిష్ మీడియా చెప్పింది. జీవీఎల్ నరసింహారావు కూడా… జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ప్రెస్మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పారు.
రాజధాని అమరావతిలో ఉండదనుకుంటున్నామని.. ఈ విషయంలో తమకు సంబంధం లేదని.. చెప్పుకొచ్చారు. అంటే.. కేంద్రానికి తెలిసే జగన్ చేస్తున్నారు.. కానీ.. తమకు సంబంధం లేదని… చెప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. ఈ విషయంలో తమ రాజకీయం తాము చేసుకుంటున్నారు.