ఒకటో తేదీ వస్తోంది. సాధారణ పరిస్థితులు ఉండి.. జీతం ఠంచన్‌గా.. వస్తుందనుకుంటున్న సమయాల్లోనే మధ్య తరగతి జీవికి గుండె గుభేలుమంటుంది. ఖర్చులన్నీ పోను.. ఇంకా ఎంత అప్పులు చేయాలోనన్న టెన్షన్ ఉంటుంది. ఇంటి అద్దె.. పాల బిల్లు.. కరెంట్ బిల్లు.. ఇలా చాంతాడంత లిస్ట్ ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా.. ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి భయాల నుంచి.. రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మహానగరాల్లో అద్దెకు ఉంటున్న వారికి కొంత రిలీఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంటి అద్దెల కోసం.. యజమానులు ఒత్తిడి చేయవద్దనే సూచనలు పంపాయి.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి సందేశం పంపగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇదే సూచనలు పంపింది. అద్దెల కోసం ఒత్తిడి తెచ్చే యజమానులపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడవద్దని స్పష్టం చేసింది. మహా నగరాల నుంచి ఓ మాదిరి మున్సిపాల్టీల వరకూ..ఎక్కువ మంది అద్దె ఇళ్లలోనే ఉంటూంటారు. వ్యాపార సముదాయాలు అయిదే.. మొత్తం.. అద్దె భవనాల్లోనే ఉంటాయి. ఇవన్నీ… గత పది రోజులుగా మూత బడిపోయాయి. వచ్చే రెండు వారాలు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అంటే.. ఒక్కటంటే.. ఒక్క రూపాయి లావాదేవీ జరిగే అవకాశం లేదు. ఈ కారణంగా.. ఎవరికీ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.
ఒకటో తేదీ తర్వాత ఇంటి అద్దెల కోసం.. దుకాణాల అద్దెల కోసం.. యజమానుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది అద్దె ఇళ్లలో ఉండరు. ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నప్పటికీ.. వారికి ఈ నెల జీతాలు సమస్యలు రాకుండా అందే అవకాశం ఉంది. అయితే.. చిరు వ్యాపారులు..రోజు కూలీలు.. ఇతర రోజువారీ వ్యవహారాల మీద నడిచే వ్యాపారాలు చేసుకునేవారికి మాత్రం ఇబ్బంది తప్పదు. ఈ కారణంగానే.. కేంద్రం.. అద్దెల విషయంలో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే..ప్రభుత్వాలు హెచ్చరించాయని.. యజమానులు వసూలు చేయడం వాయిదా వేస్తారేమో కానీ.. ఆ తర్వాతైనా వసూలు చేస్తారు. కట్టడం వాయిదా అనే రిలీఫ్ మాత్రం లబించొచ్చు. కరెంట్ బిల్లు విషయంలోనూ కేంద్రం రిలీప్ ఇచ్చే ఆలోచన చేస్తుందని… కేంద్ర విద్యుత్ మంత్రి సూచన ప్రాయంగా చెప్పారు.