ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 40,000 ఎకరాల అత్యంత సారవంతమయిన భూమిని సేకరించాలనుకొన్నప్పుడే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అది సరిపోదన్నట్లుగా ఖమ్మం జిల్లాకి ఆనుకొని ఉన్న కొండపల్లి అభయారణ్యంలోని సుమారు 19,256 హెక్టార్లను కూడా డీ-నోటిఫై చేసేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు ప్రజలు, పర్యావరణ ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న కారణంగానే కేంద్రప్రభుత్వం గుడ్డిగా అనుమతులు మంజూరు చేస్తోందని వారు విమర్శిస్తున్నారు. దూరాలోచన లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరి వలన ఆ అభయారణ్యంలో నివసించే చిరుత పులులు, ఇంకా అనేక జీవజాతులు అన్నీ నశించిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ తాము చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే అమరావతి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసామని, వీలయినంత తక్కువ అటవీ ప్రాంతాన్ని వినియోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించమని చెప్పారు. అమరావతి నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఎటువంటి జాప్యం లేకుండా మంజూరు చేస్తున్నట్లు జవదేకర్ చెప్పారు.
ప్రకాష్ జవదేకర్ చెపుతున్న మాటలు ఎలాగున్నాయంటే ‘తాంబూలాలు ఇచ్చేశాము ఇంక తన్నుకు చావండి’ అన్నట్లున్నాయి. అటవీ భూములను, అడవులను పరిరక్షించవలసిన ఆయన, అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేస్తున్నామని చెపుతూనే, వీలయినంత తక్కువ అటవీ భూమిని వినియోగించుకోమని ప్రభుత్వానికి సూచించినట్లు చెపుతున్నారు. కానీ అటువంటి సూచనలను నేడు ఎవరూ పట్టించుకొనే పరిస్థితే లేదు. ఇసుక, బొగ్గు, ఖనిజాలు త్రవ్వకాలకు ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా, అక్రమంగా త్రవ్వేసుకొంటునప్పుడు ఇంకా రాజధాని కోసం చేతిలో అన్ని అనుమతులు ఉంటే, అభయారణ్యమని అందులో వేలాది జంతువులు బ్రతుకుతున్నాయని ఎవరయినా కనికరం చూపిస్తారా? చెట్లను నరికేయడమే కాదు వీలయితే వాటిని వేటాడేస్తారు. ఈవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా అటవీ భూములను, సారవంతమయిన పంట భూములను విచ్చల్ విదిద్గా ధ్వంసం చేస్తూ ఎంత గొప్ప నగరాన్ని నిర్మించినా, పర్యావరణ సమతూకం నశించినప్పుడు వాటి దుష్ఫలితాలు శాస్వితంగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ పర్యవరణం పరి రక్షణ గురించి ఆవేదన వ్యక్తం చేయడం నేటి రోజుల్లో అరణ్యరోదనే అవుతోంది తప్ప దానిని పట్టించుకొనే నాధుడే లేడు.