పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ .. ఇక ముందుకు వెళ్లకుండా చూడాలని కృష్ణాబోర్డును కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఏపీ ఇచ్చిన పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు షెకావత్ వెంటనే స్పందించారు. బండి సంజయ్కు ప్రత్యుత్తరం పంపారు. తాను ఈ అంశాన్ని పరిశిలిస్తున్నాని… చెప్పారు. తక్షణం పరిస్థితుల్ని పరిశీలించడానికి అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేయాలని… కేఆర్ఎంబీకి చెప్పినట్లుగా… బండి సంజయ్కు పంపిన లేఖలో షెకావత్ పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఇచ్చిన ఫిర్యాదుపై వేగంగా స్పందించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోపై వివరణ ఇవ్వాలంటూ.. ఏపీ సర్కార్ కు నోటీసులు పంపించారు. కృష్ణా బోర్డు ఈ విషయంలో… కాస్త గట్టిగా ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతోంది. మరో వైపు కేంద్రమంత్రి కూడా.. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కృష్ణాబోర్డుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలన్నదానిపై ఏపీ అధికారులు కసరత్తు చేస్తూండగానే…. కేంద్ర జలవనరుల మంత్రినే… నేరుగా సంగమేశ్వరం ప్రాజెక్టుపై… ఏపీ సర్కార్ ముందుకెళ్లకుండా చూడాలని సూచించడం… కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. ఈ విషయంలో పట్టుదలగా ఉంది. రాయలసీమకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో చేపడుతున్న సంగమేశ్వం ప్రాజెక్టుకు… నేడో రేపో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. తమకు కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని చెబుతన్నారు. అయితే.. అనూహ్యంగా కేఆర్ఎంబీ నుంచి.. కేంద్రం నుంచి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉండటంతో… ఏపీ సర్కార్ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వెనకడుగు వేస్తే.. రాయలసీమ ప్రయోజనాలపై రాజీ పడినట్లు అవుతుంది. ముందుకెళ్తే… న్యాయవివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరించి.. ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావిస్తోంది.