సినీ గాయకుడిగా, నటుడుడిగా సెలబ్రిటీగా బాబుల్ సుప్రియో ఫేమస్. 2014లో బీజేపీ తరఫున బెంగాల్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. మోడీ హవాలో విజయం సాధించారు. ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఆ తర్వాత అతడు చేసిన ఓ పని ఏమిటంటే, ఓ ఎయిర్ హోస్టెస్ వెంటపడటం.
నిజమే, రెండేళ్ల క్రితం విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్ ను చూసి మనసు పారేసుకున్నాడు.కోల్ కతా నుంచి ముంబై వెళ్లే జెట్ ఎయిర్ వేస్ విమానంలో రచనా శర్మను చూసి ఫిదా అయిపోయాడు. అప్పట్లో యోగా గురువు బాబా రాందేవ్ తో కలిసి బాబుల్ ముంబై వెళ్లాడు. అప్పుడే విమానంలో కొన్ని నిమిషాలు మాట్లాడాడు. రాజకీయ ప్రవేశం గురించి కూడా టాపిక్ వచ్చింది. ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పింది.
అంతే, ధైర్యం చేసి ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. బాబుల్ సుప్రియోకు ఇంతకు ముందే పెళ్లయింది. ఓ కూతరు కూడా ఉంది. కానీ చాలా కాలంగా దంపతులకు పొసగక పోవడంతో గత ఏడాదే విడాకులు తీసుకున్నారు. ఎయిర్ హోస్టెస్ తో పరిచయం ప్రేమగా మారిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి ఆమెను కూడా ఒప్పించాడు. 45 ఏళ్ల బాబుల్ ను పెళ్లి చేసుకోవడానికి రచనా శర్మ ఓకే చెప్పింది. దీంతో ఈమధ్యే ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వచ్చే ఆగస్టులో పెళ్లికి రెడీ అవుతున్నారు.
రెండేళ్ల క్రితం తన జీవితంలోకి నవ వసంతం వచ్చేసిందని బాబుల్ ఖుషీ అవుతున్నాడు. రచన తో జీవితం చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నాడు. తనను బాగా అర్థం చేసుకున్న ఆమెను పెళ్లాడే అవకాశం రావడం తన అదృష్టం అంటున్నాడు. సింగర్, సెలబ్రిటీ, మంత్రి వగైరాలేవీ చూడకుండా ఆయన వ్యక్తిత్వం తనకు నచ్చిందని చెప్తోంది రచన. తమ భావాలు కలవడం వల్లే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మరో రెండు నెలల్లో పెళ్లి జరిగే రోజు కోసం ఇద్దరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.