టెస్లా వస్తే వచ్చింది రాకపోతే పోయింది.. దాని కంటే పెద్ద కంపెనీ అయిన చైనాకు చెందిన బీవైడీ కార్ల ఫ్యాక్టరీ తెలంగాణకు వస్తుందని అనుకున్నారు. కానీ చివరికి BYD రావడం లేదు. నిజానికి వచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధంగా ఉంది. కానీ ఢిల్లీలో కేంద్రం అడ్డుపుల్ల వేసింది. ఇండియాలో ప్లాంట్ విస్తరణకు.. కార్యకలాపాల నిర్వహణకు బీవైడీ కంపెనీకి అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా లేదని స్పష్టమయింది.
ఓ మీడియా గ్రూపు నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశంపై మాట్లాడారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇండియాలో బీవైడీ ప్లాంట్లు, పెట్టుబడులపై నిశీత పరిశీలన చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా భారత ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఆయన నేరుగా బీవైడీకి అనుమతులు ఇవ్వడం లేదని చెప్పడం లేదు కానీ.. మాటల్ని బట్టి కేంద్రం వైపు నుంచి రెడ్ సిగ్నల్ కనిపిస్తోందని మాత్రం స్పష్టమయింది.
బీవైడీ చైనాకు చెందిన అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ. అమ్మకాల్లో టెస్లాను మించిపోయింది. ఉజ్వల భవిష్యత్ ఉన్న కంపెనీగా గుర్తింపు పొందింది. అయితే బీవైడీ మన దేశంలోకి ఎంట్రీ ఇస్తే చవకైన లగ్జరీ కార్లను ప్రవేశ పెట్టి మార్కెట్ ను దున్నేస్తుందన్న అభిప్రాయం ఉంది. దీని వెనుక చైనా వ్యూహం ఉంటుందని.. చైనా గుప్పిట భారత కార్ల మార్కెట్ చిక్కకూడదన్న ఉద్దేశంతోనే బీవైడీ విషయంలో కేంద్రం ఆలోచన చేస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.