వాట్సాప్ వదంతులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి. వాట్సాప్‌లో ఫార్వార్డ్ అవుతున్న మెసెజుల కారణంగా.. వరసుగా చోటు చేసుకున్న ఘటనలే దీనికి కారణం. ఐదు రోజుల క్రితం.. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా పేరుతో ఐదుగుర్ని కొట్టి చంపేశారు. అయితే వారు అమాయకులని తర్వాత తేలింది. గ్రామస్తులు అలా రెచ్చిపోవడానికి కారణం ఏమిటంటే.. వారికి వచ్చిన వాట్సాప్ ఫేక్ న్యూస్ మెసెజ్. ఇదొక్కటే.. దేశవ్యాప్తంగా ఇలాంటి “ఫేక్ న్యూస్”ల వల్ల అమాయకులపై దాడులు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల.. కొట్టి చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా … ఉత్తరాదిలోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫార్వార్డ్ న్యూస్‌లను నిజమని నమ్మేవారు అత్యధికంగా ఉండటమే దీనికి కారణం.
ప్రభుత్వానికి సోషల్ మీడియా ఫేక్ న్యూసులు చాలా కాలంగా చికాకును కలిగిస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు దేశంలో డాటా సర్వీసుల విప్లవం నడుస్తోంది. ప్రతి మరుమూల గ్రామంలోనూ వాట్సాప్ కామన్ గా మారిపోయింది. పెద్దగా చదువుకోని వారికీ ఇది నిత్యావసరం అన్నట్లు అయిపోయింది. ఈ కారణంగా.. ఫేక్ న్యూసులు మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాట్సాప్ ఫార్వార్డులతో పెరుగుతున్న హింసాత్మక ఘటనలతో కేంద్రంపై విమర్శలు వస్తూండటంతో… కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రంగంలోకి దిగారు. ఫేక్ న్యూసుల వ్యాప్తిని కట్టడి చేయకపోతే… తీవ్ర పరిణామాలుంటాయని వాట్సాప్‌ను హెచ్చరించారు. వాట్సాప్ ప్రతినిధులు..తాము ఇంకా అంత టెక్నాలజీ సమకూర్చుకోలేదని చెప్పినా.. మంత్రి వినిపించుకోలేదు. అదేమి రాకెట్ సైన్స్ కాదు కాబట్టి.. ఫేక్ న్యూస్ వ్యాప్తిని కట్టడి చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసి పంపించారు.
ఒక్క ఇండియాలోనే కాదు.. ఇతర వర్థమాన దేశాల్లోనూ వాట్సాప్ కి ఫేక్ న్యూస్ ఫార్వార్డ్స్ పెద్ద సమస్యగా మారింది. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహవంతులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫేక్ న్యూస్ ను కట్టడి చేసే టెక్నాలజీ అభివృద్ధి చేస్తే 50 వేల డాలర్లకుపైగా ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా ప్రకటించింది. కానీ న్యూస్, ఫేక్ న్యూస్ వాట్సాప్ లో పాలునీళ్లలా కలసిపోయి వస్తాయి. దాన్ని ఫిల్టర్ చేయాలంటే.. అంత తేలికైన విషయం కాదు. కానీ అసాధ్యమేమీ కాదన్నది టెక్ నిపుణుల అంచనా. కానీ ఈ లోపే దేశంలో జరగరానివేమైనా ఒకటి రెండు జరిగితే.. వాట్సాప్ కి మూడినట్లే. దీని కోసమే దేశీయ మెసెజింగ్ యాప్ లు చకోర పక్షల్లా చూస్తున్నాయన్నది.. కొంతగా కాలంగా వాట్సాప్ లోనే ఫార్వార్డ్ అవుతున్న న్యూస్.