తిరుమలలో శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు తేలటంపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించగా, తాజాగా కేంద్రమంత్రులు ఘటనపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం కొండపై జరుగుతుందని ఫిర్యాదులు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. క్షమించరాని నేరం చేసిన వారిని విడిచిపెట్టవద్దని, అన్యమతస్తులను చైర్మన్లుగా చేశారని మండిపడ్డారు. ప్రజల అనుమానాలను నివృతి చేయాలని బండి సంజయ్ కోరారు.
మీ చుట్టూ జరుగుతున్న హిందూ వ్యతిరేక కార్యక్రమాలను క్షమించు స్వామి… తిరుమలకు చెందిన కాలేజీల్లో శ్రీనివాసుడి ఫోటోలు తొలగించారని, హిందూయేతర గుర్తులను సప్తగిరులపై ఏర్పాటు చేయాలని ఆనాటి జగన్ సర్కార్ చూసిందని మరో కేంద్రమంత్రి శోభాకరంద్లాజే వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది, దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరగాలి… దోషులను శిక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏపీ సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించి, సాయంత్రం లోపు పూర్తిస్థాయి నివేదికను పంపాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.