పవన్ కళ్యాణ్ హెచ్చరికల వల్లనయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాజపాతో తెగతెంపులకి సిద్ద పడటంవల్లనయితేనేమి, ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలని అమలుచేయడానికి సిద్దం అవుతోంది. అయితే అందరికీ తెలిసిన సమస్యలు, అవరోధాలు, కారాణాల చేత ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వకపోవచ్చని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఆ ఒక్కటీ తప్ప మిగిలిన హామీలన్నీ కాస్త అటూఇటూగా అమలుచేయడానికి సిద్దపడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తదితరులు తయారుచేసిన 5పేజీల ముసాయిదా ప్యాకేజి ఫైల్ ని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రాత్రే ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయి. దానిపై న్యాయశాఖ సలహా తీసుకొని సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక ప్యాకేజికి తుది రూపం ఇవ్వగానే దానిని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియ ముగిసి ప్రకటన వెలువడటానికి బహుశః వారం పది రోజులు పట్టవచ్చని సమాచారం. కేంద్రం నిర్దిష్టమైన ప్రకటన చేస్తే గానీ ఆ ప్రత్యేక ప్యాకేజిలో ఏమి ఉంటుందో తెలియదు కనుక దాని గురించి ఏదో గొప్పగా ఊహించేసుకొని ఆనక బాధపడటంకంటే ఆ ప్రకటన వెలువడే వరకు ఎదురుచూడటమే మంచిది. ఈలోగా దాని తరువాత జరుగబోయే రెండు అధ్యాయాల గురించి మాట్లాడుకోవచ్చు.
మొదటి అధ్యాయంలో ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇస్తే దానిని రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, ముఖ్యంగా జనసేన అంగీకరిస్తాయా లేదా అనేది చర్చించుకోవలసి ఉంటుంది.
తెదేపాకి ‘ప్రత్యేకంగా’ ఏమి ఇచ్చినా పుచ్చుకోవడానికి సిద్దంగానే ఉంది కానీ హోదాయే కావాలని ప్రతిపక్షాలు, జనసేన గట్టిగా పట్టుబడితే అది కూడా వాటితో కలిపి కోరస్ పాడక తప్పదు. ఒకవేళ ప్రతిపక్షాలు కూడా ఈ ప్రత్యేక ప్యాకేజితో సర్దుకుపోవడానికి సిద్దపడితే ఇక ఏ సమస్య ఉండదు. అందులో పేర్కొనబడిన ఆ హామీలని కేంద్రం వెంటనే అమలు చేయడం మొదలుపెడుతుంది. దాని వలన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి. కానీ ప్రతిపక్షాలు తమ చేతిలో ఉన్న బలమైన ఆ ‘ప్రత్యేక ఆయుధాన్ని’ వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. దానిని వదులుకొంటే కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేసేందుకు, వైకాపా చంద్రబాబు నాయుడుపై ప్రయోగించేందుకు అంతటి బలమైన మరో అస్త్రం వెతుకుకోవలసి వస్తుంది.
ఈ ప్రత్యేక ప్యాకేజీ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకొన్నట్లయితే, అది తెదేపా, భాజపాలకి చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. కనుక ఆ కారణం చేతైన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఈ ప్రత్యేక ప్యాకేజిని వ్యతిరేకించవచ్చు. పవన్ కళ్యాణ్ కి అటువంటి సమస్యలు, భేషజాలు ఏవీ లేవు కనుక ఆ ప్రత్యేక ప్యాకేజి వలన రాష్ట్రానికి మేలు కలుగుతుందని భావిస్తే దానిని స్వాగతించవచ్చు.
ఈ ప్రత్యేక ప్యాకేజిని ఒకవేళ అందరూ ఆమోదించినట్లయితే, తరువాత అధ్యాయంలో ఆ ప్రత్యేక క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే దానిపై అధికార, ప్రతిపక్షాలు, తెదేపా-భాజపాల మధ్య కొన్ని రోజులపాటు జరుగబోయే వాదోపవాదాలు ప్రజలకి మంచి వినోదం, కాలక్షేపం కల్పించవచ్చు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రత్యేక గర్జన చేయడం వలననే వచ్చిందని ఆయన అభిమానులు చెప్పుకోవచ్చు. తమ ఒత్తిడి కారణంగానే వచ్చిందని తెదేపా గొప్పలు చెప్పుకోవడం తధ్యం. ఇచ్చిన హామీ నిలబెట్టుకొనే గొప్ప సంస్కృతి భాజపాకి ఉంది కనుకనే ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని ఆ పార్టీ నేతలు కాలర్ ఎగురేసుకొని తిరుగవచ్చు. విధిలేని పరిస్థితులలో ఈ ప్రత్యేకాన్ని అంగీకరించవలసి వస్తే, కాంగ్రెస్, వైకాపాలు యధాప్రకారం తామే కేంద్రం మెడలు వంచి దీనైనా సాధించామని, తాము గట్టిగా పోరాడకుండా ఊరుకొని ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు ఈ మాత్రం ప్యాకేజి అయినా తేగలిగేవాడేకాదని, అయినా ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి ప్యాకేజి చేతిలో పెట్టి కేంద్రప్రభుత్వం ఆంధ్రా ప్రజలని మోసం చేసిందని ప్రచారం చేసుకొని సంతృప్తిపడవచ్చు.