ఏపీలో బీజేపీ కార్యకలాపాలు పెంచింది. ఇప్పటి వరకూ చేస్తున్నా.. కేంద్ర మంత్రుల్ని పిలిపించి.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు పెద్దగా చేపట్టలేదు. కొంత మంది కేంద్రమంత్రులు వచ్చినా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు నడ్డా సభ ఏర్పాటు చేసినా వైసీపీ సర్కార్‌పై పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై నిరసనలకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కేంద్రమంత్రుల్ని పిలిపిస్తున్నారు.
ఏపీలో ఉద్యోగాల భర్తీ చేయడం లేదని కొద్ది రోజులుగా బీజేవైఎం సంఘర్షణ ర్యాలీలను నిర్వహిస్తోంది. ఈ ర్యాలీల ముగింపు కార్యక్రమం విజయవాడలో జరుగుతోంది. ర్యాలీ ముగింపు సభలో ప్రసంగించించేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ శింగ్ ఠాకూర్ వస్తున్నారు. సిద్ధార్థ ఇస్ట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్ గ్రౌండ్స్ లో జరిగే “యువ సంఘర్షణ యాత్ర” ముగింపు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా నిర్వహించిన ర్యాలీలు కాబట్టి.. ప్రభుత్వంపై దండెత్తాలి. తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలి. లేకపోతే ఇన్ని రోజులు చేసిన ర్యాలీలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి.
ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి కేంద్రమంత్రుల్ని పిలిపించాలని ఏపీ బీజేపీ ప్రయత్నిస్తోంది. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడుకేంద్రమమంత్రుల్నే పిలుస్తున్నారు. అయితే ఇలా వస్తున్న మంత్రులు.. ఎంత కఠినంగా మాట్లాడుతారు అన్నదానిపై బీజేపీతో వైసీపీ సంబంధాలు ఎలా ఉన్నాయన్నది అర్థం చేసుకోవచ్చు. సాఫ్ట్ గా మాట్లాడితే.. ఏపీ బీజేపీని వారు పరిగణనలోకి తీసుకోవడం లేదని అనుకోవచ్చు.. కఠినంగా మాట్లాడితే మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని లెక్కలేసుకోవచ్చు