ఆదాయం లేకపోయినా ఎడా పెడా అప్పులు .. ఆస్తులు తాకట్టు పెట్టి అయినా చేసి నగదు బదిలీ పథకాలు అమలు చేసి ఓటు బ్యాంకును స్థిరపర్చుకోవచ్చని అనుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి… కేంద్ర ప్రభుత్వం మెల్లగా నట్లు బిగిస్తోంది. ఈ ఏడాది అప్పుల రుణ పరిమితిని భారీగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ అప్పులు కేవలం.. ఆర్బీఐ నుంచి బాండ్ల రూపంలో తీసుకునేవి మాత్రమే కాదు… బ్యాంకుల నుంచి తీసుకునేవాటిపైనా పరిమితి విధించింది. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులుతీసుకునే వెసులుబాటు కూడా ఇక తగ్గిపోనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నెలకు ఆరేడు వేల కోట్లఅప్పు చేస్తే తప్ప రోజు గడవని పరిస్థితి. ఈ తరుణంలో కేంద్రం ఇలా నియంత్రణలు విధించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలో ఎక్కే గడప.. దిగే గడప అన్నట్లుగా ఉన్నారు. దీనికి కారణం కేంద్రం రుణ పరిమితిని తగ్గించడమే. ఈ కారణంగా బ్యాంకులు కూడారుణాలివ్వడానికి సిద్ధపడకపోవడంతో.. రుణ పరిమితిని పెంచుకునేందుకు బుగ్గన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఏపీ చేసిన అప్పుల లెక్కలను తీసుకున్న కేంద్రం… రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా తేల్చింది. కోత వేసిన రుణపరిమితి మేరకు ఇప్పటికే ఏపీ అప్పు చేసిందని కేంద్రం గుర్తించింది.
అప్పుల కోసం ఏపీ సర్కార్ వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తోంది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి… పన్నుల ఆదాయాన్ని వాటికే బదలాయింపు చేసి.. వాటిని హామీగా పెట్టి రుణాలు సేకరిస్తోంది. మద్యంపై ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు అలాగే మళ్లించారు. ఇప్పుడు విశాఖలో ఆస్తుల్ని కూడా తనఖా పెట్టారు. మరికొన్నింటినీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆస్తులు తాకట్టు పెట్టినా.. రుణాలు వచ్చే పరిస్థితి లేకుండా కేంద్రం కట్టడి చేస్తోంది. ముందు ముందు ఏపీ సర్కార్‌కు.. ఆర్థికంగా ఉక్కపోత ప్రారంభం కాక తప్పదని అంటున్నారు.