ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు కూడా ఉన్నాయి. వాటిలో పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినా దాని పనులను రాష్ట్ర ప్రభుత్వమే పర్యవేక్షణ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేని పట్టిసీమను కూడా అందులో అంతర్భాగంగా చూపి దాని ఖర్చులని కూడా లెక్కలలో చూపడం, తెదేపా-భాజపాల మధ్య విభేదాలు వంటి అనేక కారణాల చేత దానికి కేంద్రప్రభుత్వం అవసరమయిన నిధులు విడుదల చేయడం లేదు. కనుక దాని పనులలో పురోగతి కనబడటం లేదు.
ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం డిల్లీ నుంచి ఒక బృందాన్ని ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకి పంపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సి.ఈ.ఓ. అమర్ జిత్ సింగ్, తదితరులు స్థానిక అధికారులతో కలిసి రెండు రోజులపాటు ఆ ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వారు అందించే నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకొంటుంది.
విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ స్థాపన కోసం ఆ శాఖ సంయుక్త కార్యదర్శి సుష్మా రధ్ నిన్న వైజగ్ వచ్చారు. ఈ యూనివర్సిటీకి శాశ్విత భవనాలు నిర్మించేవరకు ఆంధ్రా యూనివర్సిటీలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే పెట్రోలియం యూనివర్సిటీలో బీ.టెక్ మరియు ఎమ్.టెక్ శిక్షణా తరగతులు మొదలుపెడతామని ఆమె తెలిపారు. బీ.టెక్ పెట్రోలియం జనీరింగ్-60, కెమికల్ ఇంజనీరింగ్-60, ఎమ్.టెక్ లో తలో 18 సీట్లు చొప్పున మొత్తం 36 సీట్లు ఉంటాయని ఆమె తెలిపారు.
పెట్రోలియం యూనివర్సిటీ స్థాపనలో ఎటువంటి సందేహాలు లేకపోయినా, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ప్రజలలో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు బలమయిన కారణాలు చాలానే కనబడుతున్నాయి.
ఆ ప్రాజెక్టుకి కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం, ఆ కారణంగా రెండేళ్ళవుతున్నా పనులలో ఎటువంటి పురోగతి లేకపోవడం, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుని చేప్పట్టడం, పోలవరం పూర్తయ్యే అవకాశం లేదు కనుకనే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టిందని వైకాపా ఆరోపణలు, పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే గ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణాకి తిరిగి ఇచ్చేస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెపుతుండటం, ఆయన మాటలను చంద్రబాబు నాయుడు ఖండించకపోవడం వంటివన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. కనుక ఇకనయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మంచిది.