వరదలు వచ్చాయి…పోయాయి. వరదలు వచ్చిన వారం రోజులకు సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. రెండు వారాలకు కేంద్ర బృందం ప్రకటన ఉంటుందని ప్రకటన వచ్చింది. మూడు వారాలకు వారు వచ్చి.. పరిశీలిస్తే.. ఆ తరవాత కుదిరినప్పుడు సాయం చేస్తారు. అయితే.. ఏపీ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా కేంద్రం మాత్రం ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. వరద నష్టం అంచనా వేసి… సాయం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆలస్యంగా అయినా కాస్త రాజకీయంగా ఆలోచించారు. పొరుగున ఉన్న తెలంగాణలో కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి వరదల సెగ తగిలింది.
అంత పెద్ద వరదలు వచ్చి హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడుతూంటే.. కేంద్రం నుంచి సాయం రావడం లేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడంతో .. కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర బృందాన్ని తెలంగాణకు పిలిపించి.. నష్టాన్ని ఎన్యూమరేషన్ చేయించారు. ఇక సాయం చేస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. ఏపీకి ఆ కేంద్ర బృందం కూడా అదీ గతీ లేదు. దీంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఏపీ సర్కార్ ఎలాగూ అడగడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలే రంగంలోకి దిగారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రితో వర్చువల్ భేటీ ఏర్పాటు చేసుకుని.. కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఏపీలో ప్రభుత్వం ఉన్నా.. లేనట్లే అనుకోవాలని.. కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. సరే అని.. కేంద్ర వ్యవసాయ మంత్రి… కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. మరో వారంలో వారి పర్యటన ఉండొచ్చు.
కానీ వరదలు వచ్చి మూడు వారాలు అయిపోయిన తర్వాత వారికి ఎలాంటి నష్టం కనిపిస్తుందనేది సందేహమే. ఇప్పటికే కేంద్రం ఇచ్చే సహాయంపై సందిగ్ధం నెలకొంది. గతంలో హుదూద్ వచ్చినప్పుడు.. రూ. వెయ్యి కోట్లు తక్షణ సాయం ప్రకటించారు మోడీ. కానీ నికరంగా వచ్చిన సాయం మాత్రం రూ. 750 కోట్లేనని ప్రభుత్వ వర్గాలుచెబుతూంటాయి. అలాంటిది.. వరదలకు పంట నష్టం జరిగితే.. ఎంత ఇస్తారనేది సందేహమే. కానీ రాజకీయంగా మాత్రం.. బీజేపీ లీడర్లు ఓ స్కోర్ చేయడానికి ఈ కేంద్ర బృందం ఉపయోగపడుతుంది.