కరోనాకు మందు కనిపెట్టేశామంటూ.. కరోనిల్ పేరుతో మెడిసిన్ విడుదల చేసిన బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి.. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. కరోనిల్ కరోనాను తగ్గిస్తుందనే ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది. క్లినికల్ ట్రయల్స్ పరిశోధనా వివరాలను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించింది. అసలు ఎలాంటి పరిశోధనలు చేసి ఈ మందును విడుదల చేశారని దేశవ్యాప్తంగా ప్రశ్నలు .. విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల నమ్మకాన్ని.. భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారని.. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందని ప్రశ్నల వర్షం కురిసింది. అసలు ఎవరి అనుమతితో.. ఇలా బాబా రామ్‌దేవ్ ఆయుర్వేదం పేరుతో.. వైద్యాన్ని.. మందులను మార్కెట్ చేసుకుంటున్నారన్న చర్చ కూడా జరిగింది. దీంతో.. కేంద్రం స్పందించింది.
ఏమైనా అనుమానం వస్తే.. ముందుగా.. ఆ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి రానీయకుండా చేస్తారు. ఎందుకంటే.. అది ప్రజారోగ్యంతో కూడుకున్న విషయం. కానీ ఇక్కడ మాత్రం.. ఆ ఉత్పత్తి కరోనాను తగ్గిస్తుందన్న ప్రకటనలు మాత్రం నిలిపివేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇప్పటికే.. బాబా రామ్‌దేవ్‌తో పాటు.. ఆయన బృందం మొత్తం.. చాలా రోజులుగా ప్రచారం చేస్తున్నారు. నిన్న ఆయన ప్రొడక్ట్ లాంచింగ్ .. అన్ని చానళ్లు లైవ్ ఇచ్చాయి. ఇంత జరిగిన తర్వాత ఆ సంస్థ ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉత్పత్తి జోలికి వెళ్లకుండా.. అమ్మకాలు ఆపకుండా.. ప్రకటనలు నిలిపివేయాలని.., క్లినికల్ ట్రయల్స్ వివరాలు సమర్పించాలని ఆదేశించి సరిపెట్టింది.
గతంలో పతంజలి సంస్థ.. తన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి పిల్ల తెలివి తేటలు పెరుగుతాయని… మరొకటని… రకరకాలుగా ప్రచారం చేసుకుంది. తమ ఉత్పత్తి అయిన గోధమపండి మరేదో తెలివి తేటలు వస్తాయని కూడా చెప్పుకున్నారు. ఇలాంటి ప్రకటనలపై గతంలో.. కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. కానీ బాబా రాందేవ్ కానీ.. ఆయన పతంజలి సంస్థ కానీ.. వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కరోనిల్ కూడా అంతే. నమ్మేవారికి అంటగట్టడమే. దాని వల్ల తగ్గుతుందా లేదా అన్న సంగతి తర్వాత అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.