పోర్టులు .. ఎయిర్ పోర్టులు.. రైళ్లు ఇలా దేశంలోని ప్రతీ రంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. తాజాగా.. వ్యవసాయ రంగాన్ని అదే విధంగా కట్టబెట్టేశారన్న ఆరోపణలు కేంద్రంపై వస్తున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులు అదే చెబుతున్నాయని అంటున్నారు. పైకి రైతులకు మేలు అని చెబుతున్నప్పటికీ.. కాస్త లోతుగా విశ్లేషిస్తే… కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడే పరిస్థితి రాబోతోందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చట్టాలపై దక్షిణాదిలో ఎవరికీ పెద్దగా అవగహన లేదు కానీ ఉత్తరాదితో పాటు పంజాబ్ వంటి ప్రాంతాల రైతులకు తెలిసిపోయింది. అందుకే వారు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
వ్యవసాయం రంగంలో సంస్కరణల కోసం మసెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు-2020తో పాటు ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో గురువారం లోక్సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల సవరణ బిల్లు-2020ను మంగళవారం లోక్సభ ఆమోదించింది. వ్యవసాయ సంస్కరణలను రైతు సంఘాలు వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి. దీనికి ప్రధాన కారణం.. రైతులకు కనీస మద్దతు ధర రాకపోవడం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ద్వారా ఇప్పటి వరకూ పంటలు కొనుగోలు చేస్తున్నారు. ఇక ముందు చేయరని అంటున్నారు. వ్యవసాయం, మార్కెట్లు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. వాటిని తమ పరిధిలోకి తెచ్చుకుని నిర్వీర్యం చేయాలనే ఆలోచన కేంద్రం చేస్తోందని అనుమానిస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వెలుపల వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాలు చేసుకునే వీలుంటుంది.
రైతులకు ఆదాయాన్ని పెంచే దిశగా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రం అంటోంది. ఈ ముసుగులో కార్పొరేట్లను రంగంలోకి దించి వ్యవసాయ రంగాన్ని వారి చేతిలో పెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. కార్పొరేట్లతో ఒప్పందాలు ఉంటాయని చెబుతున్న కేంద్రం ధరల నిర్ణయానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఇంతవరకు చెప్పలేదు. కార్పొరేట్లు రంగ ప్రవేశం చేసి రైతులను దోచుకునేందుకు ఏం చేస్తారో అందరికీ తెలుసనే చర్చ నడుస్తోంది. మోడీ కార్పొరేట్ మిత్రుడని రాహుల్ అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు వదిలి పెడతారు.. .రైతుల నోటి దగ్గరి తిండిని లాక్కొని మోదీకి మిత్రులైన కార్పొరేట్ల కడుపు నింపే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది రైతులకు దీనిపై అవగాహన వస్తే మరిన్ని ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది.