కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయంలో కేంద్రం పూర్తిగా తమ చేతుల్లో లేదని స్పష్టం చేసింది. ఈ అంశం సబ్ జ్యూడిస్లో ఉందని.. అంటే ఏపీ హైకోర్టులో విచారణలో ఉందని… స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ మేరకు ఓ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి సమాధానం చెప్పారు. హైకోర్టు తరలింపులో తమ పాత్రేమీ ఉండదని.. హైకోర్టు , రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని తేల్చేసింది.
న్యాయరాజధానిగా కర్నూలును ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును కర్నూలు తరలించడానికి అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ చట్టం చెల్లుతుందా లేదా అన్న అంశంపై ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నాయి. అయితే.. చట్టం చేయకపోయినా.. హైకోర్టును కేంద్రం అనుమతితో కర్నూలుకు తరలించాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అందుకే… ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినా… హైకోర్టు రీ లోకేటింగ్ ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞాపన పత్రం సమర్పించి వస్తూ ఉంటారు. అదే విషయాన్ని మీడియాకు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం భిన్నమైన స్వరాన్ని వినిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కడుతున్న జస్టిస్ సిటీలో హైకోర్టును ఏర్పాటు చేస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా..జ్యూడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలును నిర్ణయిస్తూ.. అసెంబ్లీ చట్టం చేసింది.అదే సమయంలో… హైకోర్టు అధికారాలను కూడా.. ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఎక్కడ ఉండాలనేది.. నిర్ణయించే అధికారం.. అసెంబ్లీకి లేదనేది న్యాయనిపుణుల వాదన. ఇప్పటి వరకూ హైకోర్టులు ఏర్పాటైన విధానం భిన్నంగా ఉంది. హైకోర్టును కర్నూలులో పెట్టాలనుకున్నప్పుడు.. ముందుగా ప్రతిపాదనను… సుప్రీంకోర్టుకు.. ఏపీ ప్రభుత్వం పంపాలి. హైకోర్టు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో న్యాయవ్యవస్థ ప్రధాన స్టేక్ హోల్డర్ అయినప్పుడు వారికి సంబంధం లేకుండా తరలింపు అనేది సాధ్యం కాదు.