అఖిలభారత సర్వీసు అధికారుల్ని ఎంపిక చేసే యూపీఎల్సీ సివిల్స్ పరీక్షల్లో సమూలమైన మార్పులు తేవాలని కేంద్రం నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ కోసం ‘మిషన్ కర్మయోగి’ ఏర్పాటు కోసం కేంద్రమంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రధాని పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ ఉంటాయి. ఎంపికయ్యే వారందరికీ సివిల్ సర్వీసెస్ అధికారులకు ‘కర్మయోగి’ మిషన్ కింద ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చాలా రోజుల నుంచి కేంద్రం.. కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం… క్యాడర్ల ఎంపికలో ఇక మార్కుల ప్రాదిపతిక తగ్గిపోనుంది.
అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ లాంటి 24 క్యాడర్లకు ఇప్పటి వరకు సంప్రదాయ మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. యూపీఎస్సీ మూడంచెల పరీక్ష.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో అభ్యర్థులు సాధించే మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి క్యాడర్లకు ఎంపిక చేస్తారు. కొత్త పద్దతి ప్రకారం యూపీఎస్సీ నిర్వహించే మూడంచెల పరీక్షలో విజయవంతమైన అభ్యర్థులకు తదుపరి మూడు నెలలు ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తారు. దీన్ని ‘మిషన్ కర్మయోగి’ వ్యవహరిస్తారని అనుకోవచ్చు.
మిషన్ కర్మయోగి శిక్షణ సమయంలో అభ్యర్థిని అన్ని విధాలా పరీశీలించి, వారిని వ్యక్తిగతం, నాయకత్వ పరంగా పరీక్షించి క్యాడర్‌కు ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. 3 నెలల సమయంలో అభ్యర్థుల ప్రతిభా పాటవాలను గుర్తించి వాటి ఆధారంగా వారిని ఏ క్యాడర్‌కు పంపాలో నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రతిపాదనపై అభిప్రాయాలను అన్ని విభాగాల నుంచి పీఎంవో సేకరించింది. ఇక నుంచి మూడు మాసాల ఫౌండేషన్ కోర్సులో ప్రతిభ చూపితేనే అభ్యర్థులకు ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లు వస్తాయి. ఇదే విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది.