అమరావతి అధికారికంగా దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కనిపిస్తోంది. దీన్ని ధృవీకరిస్తూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. ఓ వైపు..ఏపీ రాజధాని విషయంలో తమకు సంబంధం లేదంటూ..కేంద్రం..ఇలా గుర్తింపుతో మ్యాప్‌లు విడుదల చేయడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఓ సారి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రస్తావన లేకుండా మ్యాప్ విడుదల చేశారు. ఈ విషయాన్ని గత ఏడాది నవంబర్‌లో గల్లా జయదేవ్ పార్లమెంట్లో ప్రస్తావించారు.
అప్పటికప్పుడు కేంద్రం… అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మ్యాప్ ను విడుదల చేసింది. ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర సర్వే జనరల్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ప్రత్యేకంగా లేఖ రాశారు. దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆమోదం మేరకే ఈ లేఖను విడుదల చేస్తున్నట్టు ప్రదీప్ సింగ్ ఆ లేఖలో వివరించారు. ఈ లేఖ కాపీని కేంద్రంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శికి కూడా పంపుతున్నామని వివరించారు. రాజధానులను నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకుంటుందని… ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని కేంద్రం తరపున కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు.
మరో వైపు ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించినట్లుగా మ్యాప్‌లు విడుదల చేస్తున్నారు. రాజధాని మార్పు అనేది ఇంత వరకూ ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఒక వేళ ఏపీ సర్కార్ మార్చినా…కేంద్రం తన రికార్డుల్లో మార్చాల్సి ఉంటుంది. అప్పుడైనా కేంద్రానికి సంబంధం ఉన్నట్లే కదా అన్న చర్చ నడుస్తోంది.