ఉత్తరాఖండ్ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన మెజారిటీ నిరూపించుకొనేందుకు అనుమతిస్తే మంచిదనే సుప్రీం కోర్టు సూచనను కేంద్ర ప్రభుత్వం గౌరవించి అందుకు అంగీకరిస్తున్నట్లు ఈరోజు తెలియజేసింది. ఒకవేళ అందుకు అంగీకరించనట్లయితే, ఈ కేసుపై తన తీర్పును తక్షణం వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నానని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో, తప్పనిసరి పరిస్థితులలో అందుకు అంగీకరించవలసి వచ్చింది. ఈనెల 10వ తేదీన ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష జరుపమని సుప్రీం కోర్టు కొద్ది సేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఆ కొద్ది సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండదని ప్రకటించింది. సుప్రీం కోర్టు పరిశీలకుడు పర్యవేక్షణలో శాసనసభలో బలపరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అనర్హత వేటు పడిన 9మంది ఎమ్మెల్యేలకు ఈ బలపరీక్షలో పాల్గొనేందుకు వీలు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అనర్హత వేటు పడిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ బలపరీక్షలో పాల్గొనేందుకు అవకాశం కల్పించకపోవడంతో, భాజపా పని వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా పోయినట్లయింది. ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ-36, భాజపా-28, బి.ఎస్.పి.-2, యు.కే.డి.పి.-1, స్వతంత్రులు-3 మంది సభ్యులుగా ఉన్నారు.
వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడినందున కాంగ్రెస్ పార్టీ బలం-27కి పడిపోయింది. రావత్ ప్రభుత్వానికి మిగిలిన 6మంది సభ్యులు మద్దతు ఇస్తున్నారు. అంటే రావత్ వద్ద మొత్తం 33 మంది సభ్యులు ఉన్నట్లు లెక్కవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాలసిన మ్యాజిక్ నెంబర్ 36 మంది. కనుక మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనకి అవసరం. కానీ భాజపా నుండి ఎవరూ రావత్ కి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కానీ పదవులు, అధికారం కోసం ఇంతవరకు రావత్ కి మద్దతు ఇస్తున్నవారిలో కొంతమంది భాజపావైపు జంప్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ అలా జరుగకపోతే కాంగ్రెస్, భాజపా రెంటికీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగల సామర్ధ్యం ఉండదు కనుక రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది.