ఎదురు చూసి.. చూసి సహనం నశించి.. పోలీసులపై దాడులకు పాల్పడుతున్న వలస కార్మికుల ఆగ్రహం పూర్తి స్థాయిలో కట్టలు తెంచుకోక ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఎక్కడి వారు అక్కడే ఉండాలని పెట్టిన నియమాన్ని తొలగించింది. ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఉంటే తీసుకెళ్లవచ్చని సూచించింది. ఉదయం హైదరాబాద్ శివారులో పదహారు వందల మంది వలస కూలీలు తమను స్వరాష్ట్రానికి పంపాలని.. ఆందోళన చేశారు. పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. దేశంలో పలు చోట్ల వలస కూలీల క్యాంపుల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో.. కేంద్రం… శరవేగంగా నిర్ణయం తీసుకుంది.
ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. బస్సుల్లో వారిని తీసుకెళ్లవచ్చని రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదుల చేసింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. ప్రతి ఒక్కరికి పరీక్,లు చేయాలని.. కరోనా లక్షణాలు లేకపోతే తీసుకెళ్లాలని స్పష్టంచేసింది. స్వస్థలాలకు వెళ్లిన ప్రతీ ఒక్కరూ హోం క్వారంటైన్ పాటించేలా స్థానిక వైద్య అధికారులు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కడిక్కడ ఇరుక్కుపోయిన కూలీలు, విద్యార్థులు, మత్స్యకారుల కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది.
కేంద్రం అనుమతించడంతో.. గుజరాత్ లో ఇరుక్కుపోయినా తెలుగు మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే ప్రక్రియను ఏపీ అధికారులు ప్రారంభించారు. 4,065 మంది బస్సుల్లో బయల్దేరారని.. అన్ని ఖర్చులు పెట్టి తీసుకొస్తున్నామని ఏపీ అధికారులు ప్రకటించారు. వచ్చిన మత్స్యకారులందరికీ 2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వీరే కాదు.. పలు రాష్ట్రాల్లో కనీసం.. రెండు లక్షల మంది కూలీలు, విద్యార్థులు ఇరుక్కుపోయారు. వారందర్నీ తెప్పించాల్సిన బాధ్యత ఏపీ సర్కార్ పై పడింది.