భారత్ లో మొట్టమొదటి బులెట్ ట్రైన్ ప్రాజెక్టుకి ఈరోజు కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ ప్రాజెక్టుని జపాన్ దక్కించుకొంది. సుమారు రూ.98,000 కోట్లతో ముంబై-అహ్మదాబాద్ మధ్య ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు. గంటకు 250-300 కిమీ వేగంతో నడిచే ఈ బులెట్ ట్రైన్ ముంబై-ఆహ్మదాబాద్ మధ్య గల 505 కిమీ దూరాన్నిఅధిగమించడానికి ఎక్స్ ప్రెస్ రైళ్ళకి సుమారు ఏడు గంటల సమయం పడుతోంది. కానీ బులెట్ రైలు మాత్రం ఆ దూరాన్ని కేవలం రెండు గంటలలో అధిగమించగలదు. ఈ ప్రాజెక్టు కోసం చైనా కూడా చాలా ఆశలు పెట్టుకొంది. కానీ భద్రతా ప్రమాణాలు, సమయపాలనలో ఖచ్చితత్వం వగైరా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొన్న భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జపాన్ కే ఇవ్వడానికి నిర్ణయించుకొంది. ఈ ప్రాజెక్టు తమకు దక్కకపోవడంపై చైనా స్పందిస్తూ భారత్ లో ఇంకా చాలా విస్తృతమయిన అవకాశాలున్నాయని, తమకు మున్ముందు తప్పకుండా అవకాశం దొరుకుతుందని భావిస్తున్నామని అంది. జపాన్ ప్రధాని సింజు ఆబే భారత్ లో మూడు రోజుల పర్యటనకు రేపు డిల్లీ వస్తున్నారు. అప్పుడు రెండు దేశాల ఈ ప్రాజెక్టుపై సంయుక్త ప్రకటన చేస్తారు.