పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. గత ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ..పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారంటూ.. విమర్శలు చేశారు. దీన్నే గుర్తు చేస్తూ.. జనసేన నేత ,రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు.. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు. పోలవరం అవినీతిపై వివరాలు బయట పెట్టాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ పెంటపాటి పుల్లారావుకు సమాధానం పంపింది. పోలవరంలో అవినీతి జరిగిందని.. విచారణ జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తను ఆదేశించలేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఓ విచారణ కమిటీని నియమించింది.. ఆ కమిటీ నివేదికను.. ఏపీ ప్రభుత్వమే పక్కన పెట్టిందని జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ అధికారి రేమండ్ పీటర్ అనే జగన్ బంధువు నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలన జరిపి.. అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ నివేదికను తీసుకెళ్లి జలశక్తి శాఖకు.. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ ఇచ్చారు. దాంట్లో ఉన్న అవినీతి ఆరోపణలపై.. ఆధారాలు కావాలని… జలశక్తి శాఖ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. రేమండ్ పీటర్ కమిటీ చేసిన ఆరోపణలు.. పేర్కొన్న అవినీతి అంశాలకు ఆధారాలు కావాలని రెండు, మూడుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. అదే సమయంలో పోలవరానికి విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులు కూడా.. ఏపీ సర్కార్ నియమించిన కమిటీ గుర్తించినట్లుగా చెప్పిన అవకతవకల వ్యవహారం తేలిన తర్వాతే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏపీ సర్కార్.. రేమండ్ పీటర్ కమిటీ అవినీతి చేసిందని చెప్పిన వాటిని ఆధారాలు సమర్పించలేక.. ఆ నివేదికను తాము పక్కన పెడుతున్నామని పరిగణనలోకి తీసుకోవద్దని జలశక్తి శాఖకు సూచించిది.
ఇదే విషయాన్ని పెంటపాటి పుల్లారావుకు జలశక్తి శాఖ తెలిపినట్లుగా తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగానే.. అవినీతికి తావు లేకుండా పోలవరం నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తమకు చెప్పినట్లుగా కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పోలవరంలో అవినీతి అంటూ.. వైసీపీ నేతలు .. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కేంద్ర జలశక్తి శాఖనే చెక్ పెట్టినట్లయింది. రేమండ్ పీటర్ కమిటీ అమరావతిపై కూడా.. ఇలాంటి ఓ నివేదిక తయారు చేసింది. అందులో 30వేల కోట్ల గోల్ మాల్ జరిగినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను మీడియాకు లీక్ చేశారు. మొత్తంగా పదివేల కోట్ల విలువైన పనులు జరిగితే 30వేల కోట్ల గోల్ మాల్ ఎలా జరిగిందనే విమర్శలు రావడంతో.. ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్‌ను బయట పెట్టలేదు.