దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి కేంద్రప్రభుత్వం ప్రతీ ఏటా బారీగా నిధులు మంజూరు చేస్తుంటుంది. కానీ ఆ నిధులు సద్వినియోగం అవుతున్నాయో లేదో తెలుసుకొనేందుకు ఎటువంటి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో, వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడవలసివస్తోంది. కనుక నిధుల దుర్వనియోగం లేదా మళ్లింపు జరిగినట్లయితే ఆ విషయం కేంద్రప్రభుత్వానికి తెలిసి అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు.
దీనిలో ఇంకో సమస్య కూడా ఇమిడి ఉంది. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి తమపేర్లు తగిలించుకొని అమలు చేస్తూ అవన్నీ తమ స్వంత పధకాలని ప్రచారం చేసుకొంటున్నాయి. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే కేంద్రానికి అభ్యంతరం ఉండేది కాదు కానీ భాజపాయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు వాటిని తమ స్వంత పధకాలుగా చెప్పుకొంటుండటంతో, ఆ రాష్ట్రాలలో భాజపాకి దక్కవలసిన క్రెడిట్ అక్కడ అధికారంలో ఉన్న పార్టీలకి దక్కుతోంది. పైగా కేంద్రప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడంలేదని కూడా అవి ప్రచారం చేస్తుండటం వలన భాజపా పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగి ఇంకా నష్టపోతోంది.
కనుక కేంద్రప్రభుత్వం నిధులతో వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని స్వయంగా గమనిస్తూ, వాటి లోటుపాట్లని, జరుగుతున్న తప్పొప్పులని గమనించేందుకు కేంద్రప్రభుత్వం తరపున జిల్లా స్థాయిలో అధికారులని నియమించాలని అనుకొంది. కానీ ఆ ఆలోచనకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఇప్పుడు కేంద్రప్రభుత్వం మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే స్థానిక ఎంపిలతో ‘జిల్లా స్థాయి మౌలిక సదుపాయాల పధకాల సలహా సంఘాలు’ ఏర్పాటు చేయడం. వాటికే క్లుప్తంగా దిశ కమిటీలని పేరు పెట్టింది.
ఆ కమిటీలు ఏడాదికి నాలుగుసార్లు సమావేశం అయ్యి, జిల్లా స్థాయిలో కేంద్ర నిధులతో సాగుతున్న అభివృద్ధి పనులని సమీక్షిస్తుంటాయి. ఆగస్ట్ 23న దేశ వ్యాప్తంగా దిశ కమిటీల తొలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో తప్ప మిగిలిన చోట్ల కనీసం ఒక్క భాజపా ఎంపి అయినా ఉన్నారు కనుక వేరే పార్టీల ఎంపిలతో ఆ దిశా కమిటీలు ఏర్పాటయినప్పటికీ వాటిలో ఒక్క భాజపా ఎంపి అయినా తప్పకుండా ఉంటారు కనుక ఆ సమీక్షా సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలు, వివిధ పనులు జరుగుతున్న తీరు గురించి అ ఎంపి ద్వారా కేంద్రానికి పూర్తి నివేదిక అందుతుంటుంది. ఒకవేళ ఆ కమిటీలలో భాజపా ఎంపి లేకపోయినా కేంద్రం నుంచి నిధులు పొందాలంటే ఆ కమిటీ తన నివేదికలని కేంద్రప్రభుత్వానికి తప్పనిసరిగా అందించవలసి ఉంటుంది. ఎంపిలతో కూడిన ఆ కమిటీలు కేవలం మౌలికవసతుల అభివృద్ధికి సంబంధించిన పనులని మాత్రమే సమీక్షించడానికే పరిమితం కాకుండా సంక్షేమ పధకాలని కూడా సమీక్షించడం ఖాయం కనుక వివిధ రాష్ట్రాలలో కేంద్ర నిధులతో జరుగుతున్న అన్ని రకాల పనులపై కేంద్రప్రభుత్వం పరోక్షంగానైనా పెత్తనం చెలాయించగలుగుతుందని చెప్పవచ్చు. ఆ కమిటీలలో ఎమ్మెల్యేలకి కూడా అవకాశం కల్పించి ఉంటే, భాజపా ఆలోచన ఇంకా ఫలించి ఉండేది కదా?