అడగందే అమ్మయినా పెట్టదన్నట్లు, అసంతృప్తి వ్యక్తం చేయకపోతే కేంద్రం కూడా చెయ్యి విధిలించదని ఇప్పుడు చెప్పుకోవలసి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడిని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని ఎన్నిసార్లు అడిగినా ప్రత్యేక హోదా కాకపోయినా కనీసం వాళ్ళు ఇస్తామని ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కూడా ఇంతవరకు మంజూరు చేయడంలేదు ఎందుకో? ప్రత్యేక రైల్వే జోన్ హామీని కూడా కేంద్రం పక్కన పడేసినట్లుగా వార్తలు వచ్చేయి. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రాదేయపడినా సాధ్యం కాని కొన్ని పనులు తెరాస నేతలు కేంద్రం తీర్పుపై కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినంతనే సాధ్యం అవుతున్నాయి.
నెలరోజుల క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రెండు లక్షల ఇళ్ళు, తెలంగాణాకి కేవలం 10, 000 ఇళ్ళు మంజూరు చేసినప్పుడు తెరాస నేతలు అందరూ కేంద్రంపై చిటపటలాడారు. తెలంగాణా రాష్ట్రంపట్ల కేంద్రం చాలా వివక్ష చూపుతోందని వారు విమర్శించారు. వారి విమర్శలకి బీజేపీ నేతలు సరిగ్గానే జవాబు చెప్పుకొన్నారు. కానీ వాటి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య కేంద్రం చాలా వ్యత్యాసం చూపిస్తోందనే భావన తెలంగాణా రాష్ట్ర ప్రజలకు కలిగేలా చేయగలిగారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముందు బీజేపీ పట్ల ఇటువంటి చెడు అభిప్రాయం ఏర్పడటం అంత మంచిది కాదని కేంద్రం భావించిందో ఏమో తెలియదు కానీ నిన్న తెలంగాణా రాష్ట్రానికి 45,217 ఇళ్ళు మంజూరు చేసింది. బహుశః జి.హెచ్.ఎం.సి.ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వాటిలో 29, 531 హైదరాబాద్ కి కేటాయించినట్లుంది. కానీ తెరాస ప్రభుత్వం కూడా జి.హెచ్.ఎం.సి.పరిధిలో నివసిస్తున్న పేద ప్రజలకి ‘డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్’ బంపర్ ఆఫర్ ఇస్తోంది. కనుక తెరాస,బీజేపీలు ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్లలో జంటనగరాలలో ప్రజలు వెతికి మొగ్గుచూపి ఎవరికీ ఓట్లు వేస్తారో వేచి చూడాలి.