కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని తరచూ తెరాస నేతలు విమర్శిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ తెలంగాణాను చిన్న చూపు చూస్తోందని వారి వాదన. ప్రధాని నరేంద్ర మోడి విదేశాలలో పర్యటిస్తారు తప్ప కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రానికి రావడానికి ఇష్టపడారని మంత్రి కె.టి.ఆర్. విమర్శించడం అందరూ విన్నారు. కానీ తెరాస నేతల విమర్శలు, ఆరోపణలు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవేనని అందరికీ తెలుసు. అయితే తెలంగాణా బీజేపీ నేతలు ఎవరూ కూడా వారు చేస్తున్న ఈ విమర్శలను, ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టలేకపోవడంతో అవి నిజమేనని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా బీజేపీకి మంచి పట్టున్న హైదరాబాద్ జంట నగరాలలో కూడా ఓటమి పాలయింది.
కేంద్రప్రభుత్వం ఆంధ్రాతో సమానంగానే తెలంగాణాను కూడా చూస్తోంది. ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసి తమ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయమని కోరగా, అందుకు అంగీకరించి తక్షణమే రూ. 450 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల వలన తెలంగాణాలో త్రాగునీరు సాగు నీరు సమస్యలు తీరే అవకాశం ఉండటంతో అవి కేంద్రాన్ని, దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలని చాలా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాలలో వెనుకబడిన గ్రామాలలో ఈ ప్రాజెక్టుల అమలు చేయడం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటికే కాకుండా ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్చ భారత్ వంటి అనేక కేంద్ర పధకాల క్రింద కూడా తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉదారంగా నిధులు మంజూరు చేస్తోంది.
అయితే వాటి గురించి గట్టిగా ప్రచారం చేసుకోవడంలో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలు తీవ్ర అశ్రద్ద చూపిస్తుండటం వలన, ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒకవైపు ఈవిధంగా కేంద్రప్రభుత్వం నుంచి భారీగా నిధులు అందుకొంటూనే తిరిగి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. అంతే కాక కేంద్రం మంజూరు చేస్తున్న ఆ నిధులతో చేపడుతున్న పధకాలను, అభివృద్ధి పనులను తమ స్వంతవిగా చెప్పుకొని రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయి. అందుకే మార్చి 6న రాజమండ్రిలో బీజేపీ బారీ బహిరంగ సభ నిర్వహించి తమ ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, సహాయ సహకారాల గురించి చెప్పుకోబోతోంది.