ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్ర నేరాల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ ట్రయల్‌కు కేంద్రం సముఖత తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. సిట్టింగ్, మాజీ ప్రజాప్రతినిధులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా సుప్రీంకోర్టులో వాదించారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని దాఖలైన పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. గతంలో ఓ నివేదిక ఇచ్చిన అమికస్ క్యూరీ తాజాగా.. సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల స్టేటస్‌పై అమికస్ క్యూరిని ధర్మాసనం వివరాలు అడిగింది. కొన్ని కేసుల విచారణ ప్రారంభం కాలేదన్న అమికస్ క్యూరి తెలిపారు. విచారణ వేగవంతం చేసేలా ట్రయల్ కోర్టులను ఆదేశించాలని అమికస్ క్యూరి న్యాయస్థానాన్ని కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను నిర్ణీత కాలపరిమితిలో ముగించాలని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ వాదించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు, వసతుల కల్పనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరి సూచించారు.
ఈ మేరకు ఆదేశాలిస్తామని ధర్మానసం తెలిపింది. సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల్లో జిల్లాల వారీగా కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్నాయి. అవి కూడా ఏడాదిలో తేలిపోతే రాజకీయంగా సంచలనాలు ఖాయమని భావించవచ్చు.