తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి వాటిని కేవలం 6 బ్యాంకులుగా ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులలో పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిల కారణంగా అవి తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటికి తోడు మార్కెట్ పై పట్టు సాధించేందుకు వాటిలో అవి, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బ్యాంకులు, ఆర్ధిక సంస్థలతో కూడా పోటీ పడవలసిరావడంతో లాభాలు కనిష్టస్థాయిలో ఉంటున్నాయి. ఇవి కాక ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆ కారణంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. కనుక బ్యాంకులను బలోపేతం చేయడమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఆర్ధిక నిపుణులతో కూడిన ‘జ్ఞాన్ సంఘం’ అభిప్రాయం వ్యక్తం చేసింది.
వారి సూచన మేరకు కేంద్రప్రభుత్వం ఆర్ధిక నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఏర్పాటు చేయబోతోంది. ఆ కమిటీ ‘బాంక్స్ బోర్డ్ బ్యూరో’ (బి.బి.బి.) తో కలిసి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీన ప్రక్రియకు అవసరమయిన మార్గదర్శకాలు తయారు చేస్తుంది. దేశవ్యాప్తంగా 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు చెందిన వేలాది శాఖల పనితీరు, వ్యాపారం, లాభదాయకత పెరిగేవిధంగా ఈ విలీన ప్రక్రియను అమలుచేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో వాటిపై ఎటువంటి దుష్ప్రభావం లేదా నష్ట పోకుండా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక ఏ బ్యాంకులను దేనిలో విలీనం చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకొనేందుకు ఆ బ్యాంకుల ఆదాయం, అప్పులు, నిరర్ధక ఆస్తులు, అవి పనిచేస్తున్న ప్రాంతాలు, అక్కడి ప్రజలు సదరు బ్యాంకులతో జరిపే లావాదేవీలు వంటి అనే అంశాలపై చాలా లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుండి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ వాటన్నిటిపై లోతుగా అధ్యయనం చేసి బ్యాంకుల విలీనానికి అవసరమయిన మార్గదర్శకాలతో కూడిన ఒక నివేదిక తయారు చేస్తుంది. దాని ఆధారంగా బ్యాంకుల విలీనం జరుగుతుంది. ఈ విలీన ప్రక్రియకి ఏదయినా బ్యాంకు అభ్యంతరం చెపితే తప్ప ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోకూడదదని భావిస్తోంది. మోడీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంకుని కూడా ఏదో ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుతో విలీనం చేయబడుతుంది. ఈ విలీన ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల నుండి ఏడాది వరకు సమయం పట్టవచ్చునని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.