బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోగానే దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా ఆంధ్రాలో పార్టీలు కూడా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇకనయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ తదితర హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. అవి అడిగినా అడగకున్నా బీహార్ ఎన్నికల తరువాత ఏపీకి సుమారు రూ. 2.25 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మోడీ ప్రభుత్వం ప్రకటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత మొత్తం ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ భారీగా ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వడం ఖాయమని అందరూ విశ్వసిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏపీకి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకుండా మొన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి రూ.80, 000 కోట్లు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడంతో రాష్ర్ట ప్రజలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా అసంతృప్తి వ్యక్తపరిచాయి. ప్రధాని నరేంద్ర మోడి జనవరిలో హైదరాబాద్ పర్యటనకి వచ్చినప్పుడు ఏపికి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించవచ్చని వార్తలు వచ్చేయి. కానీ బిహార్ ఓటమి నేపధ్యంలో మోడీ ప్రభుత్వం వీలయినంత త్వరగానే ఏపికి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించవచ్చని లేకుంటే ఏపీలో కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.