ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రగడ జరుగుతున్న సమయంలోనే… కేంద్రం పార్లమెంట్ వేదికగా కాస్త విశేషమైన ప్రకటనే చేసింది. ఏపీ రాజధానిగా అమరావతిని 2015లోనే నోటిఫై చేశామని … కేంద్రమంత్రి నిత్యానందరాయ్… ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై.. కేంద్రాన్ని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. ఈ విషయంలో… కేంద్రానికి సంబంధం లేదని… రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి. . అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాజధానిని నిర్ణయించి.. కేంద్రానికి తెలియచేయడంతో.. నోటిఫై చేసినట్లుగా కేంద్రం చెబుతోంది.
అంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం రికార్డుల్లో అమరావతి ఉన్నట్లే. అదే సమయంలో.. మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం పంపలేదన్న కేంద్రమంత్రి… అయితే.. మీడియాలో మాత్రం చూశానని చెప్పుకొచ్చారు. అయితే.. ఒక సారి రాజధానిని నోటిఫై చేసిన తరవాత… మళ్లీ మళ్లీ రాజధానులను మార్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా.. అన్నదానిపై స్పష్టత లేదు. అది రాష్ట్రాల అంతర్గత వ్యవహారంగా కేంద్రంచెబుతూ వస్తోంది. కేంద్ర మంత్రి కూడా అదే చెప్పారు. బీజేపీ కూడా కొన్నాళ్లుగా అదే చెబుతోంది.
కేంద్రానికి ఇప్పటికిప్పుడు సమాచారం ఇవ్వకపోయినా … రేపు మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయం ఖరారయ్యాక.. కచ్చితంగా నోటిఫై చేయడానికైనా.. కేంద్రానికి అసలు విషయం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం.. ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ఎందుకంటే… ఏ రాజధాని లేని కొత్త రాష్ట్రానికి రాజధాని పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే.. నోటిఫై అయిన రాజధానిని మార్చడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందా లేదా.. అన్నదానిపై… క్లారిటీ రావాల్సి ఉంది.