ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించేలా కేంద్రం మెడలు వంచాలంటే, విభజన నేపథ్యంలో ఏపీకి దక్కవలసిన సమస్తం దక్కేలా కేంద్రాన్ని ఒప్పించాలంటే ఉద్యమపథం తప్ప మరో మార్గం లేదని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు సామరస్యంగా సాధించాలనే మాట చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం చైతన్యం పెరిగి ఉద్యమ బాట తొక్కితేనే ఫలితం ఉంటుందని మేధావులు భావిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో గొప్ప ధర్నా జరిగిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రమేయం లేకుండా ఉద్యమాలు మొదలు కావాలని అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలు, వ్యాపారులు, సంస్థలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది కేంద్రం బుద్ధిలో మార్పు తేగలదని, దానివలన ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం దక్కవలసిన హోదాను ఇవ్వనప్పుడు, రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టవలసిన పన్నుల విషయంలో ఎవ్వరూ పట్టించుకోకూడదని, కేంద్రానికి కట్టవలసిన పన్నులు ఎగవేయాలని మేధావులు, ఉద్యమకారులు పిలుపు ఇస్తున్నారు.
స్వాతంత్య్ర పోరాట కాలంలో కూడా మహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు ఇచ్చే వరకు బ్రిటిషు వారి అణచివేత మరో రేంజిలో సాగిన సంగతి అందరికీ గుర్తుంటుంది. సహాయ నిరాకరణ పన్నులు చెల్లించకపోవడం వంటి ప్రభుత్వానికి నష్టం కలిగే పనులు మొదలైన తర్వాతనే వారి వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహాలో రాష్ట్రం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం వస్తేనే హోదా సాధించడం కుదురుతుందని పలువురు పిలుపు ఇస్తున్నారు. ప్రజలు పరిస్థితుల్ని అంతవరకు తీసుకు వెళ్లకుండా కేంద్రం తమ ప్రతిష్టకు మచ్చ రాకుండా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.